నేరస్తులపై కఠిన చర్యలు

3 Nov, 2020 02:53 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత. చిత్రంలో అధికారులు

రాష్ట్ర హోం మంత్రి సుచరిత

మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత  

సాక్షి, విశాఖపట్నం: వరలక్ష్మి కేసులో నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాజువాక మండలం చినగంట్యాడ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మప్రియ, సత్యగురునాథ్‌కు కలెక్టర్‌ వినయ్‌చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆమె అందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వరలక్ష్మి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. తక్షణమే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం స్ఫూర్తితో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు. నిందితుడు అఖిల్‌ సాయిని రిమాండ్‌కు తరలించారని.. అతని తండ్రి, వారి కుటుంబసభ్యులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు.
వరలక్ష్మి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత  

దిశ యాప్‌లో ఫిర్యాదు చేయండి..
చిత్తూరులో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడికి 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారైందని.. విజయవాడలో 4 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడిందని హోం మంత్రి సుచరిత గుర్తు చేశారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను కూడా వివరించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థినీ దిశ యాప్, ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా ఎం.పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, సౌత్‌ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఆర్‌డీవో కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు