మహిళా సాధికారత నినాదం కాదు.. మా విధానం 

19 Nov, 2021 03:27 IST|Sakshi

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం 

సంక్షేమ పథకాల ద్వారా ఖాతాల్లోకి నేరుగా నగదు జమ 

దిశ బిల్లు ద్వారా మహిళా భద్రతకు భరోసా  

మండలిలో ‘మహిళా సాధికారత’ అంశంపై చర్చలో మంత్రి మేకతోటి సుచరిత 

సాక్షి, అమరావతి: మహిళా సాధికారత అనేది నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల్లా కాకుండా అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారతను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో గురువారం ‘మహిళా సాధికారత’ అంశంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆమె మాట్లాడారు. కులం, మతం, ప్రాంతం అనేవేవీ చూడకుండా రాష్ట్రంలోని మహిళలు అందరికీ వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తోందని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. 

► రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇస్తే అందులో 80 శాతంపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలు ఉన్నారు.  
► రాష్ట్రంలో 2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లలో 1.33 లక్షల మంది మహిళలు.  
► నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ వర్క్‌లలో 50 శాతం మహిళలకు  కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. 
► ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరడం, స్వయం సహాయక సంఘాల నిరర్థక ఆస్తులు తగ్గి, గ్రేడింగ్‌ పెరగడం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలకు నిదర్శనం. 
► దిశ చట్టంపై కేంద్రం లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసి పంపాం. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దిశ చట్టం అమల్లోకి వచ్చే లోగా ఆ స్ఫూర్తి దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.    

మహిళలు జయహో జగనన్న అంటున్నారు 
జయహో జగనన్న.. సాహో జగనన్న అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ‘మహిళా సాధికారత’పై చర్చను ప్రారంభిస్తూ.. సీఎం వైఎస్‌ జగన్‌ రెండున్నరేళ్ల పాలనలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు అందుకున్నారని చెప్పారు. వరుస ఎన్నికల్లో మహిళలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగన్‌కు అండగా నిలిచారన్నారు. మహిళలకు నామినేటెడ్‌ పదవులతోపాటు అనేక రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. సీఎం జగన్‌ చూపిన దార్శనికత వల్లే చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. ఈ చర్చలో కల్పలతారెడ్డి, రామారావు, కత్తి నరసింహారెడ్డి, మాధవ్, జకియా ఖానంలు మాట్లాడుతూ మహిళల రక్షణ, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.  

మాటలు కాదు.. చేతలు 
చట్టం చేయకుండానే అత్యధిక సంఖ్యలో మహిళలను చట్ట సభలకు పంపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కితాబిచ్చారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనే మాటలను ఆచరణలో పాటించిన నేత జగన్‌ అన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహిళను హోం మంత్రిని చేస్తే.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ దళిత మహిళకు ఆ శాఖ అప్పగించారని, ఇదే మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అని వ్యాఖ్యానించిన చంద్రబాబుకు మహిళల పట్ల ఎంత వివక్ష ఉందో ఇట్టే తెలుస్తోందని చెప్పారు.    

మరిన్ని వార్తలు