‘బాధితులందరికీ త్వరలోనే సాయం అందుతుంది’

19 Oct, 2020 19:33 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వరద బాధితులందరికీ త్వరలోనే సాయం అందుతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, ఇప్పటికే ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సోమవారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు.‘‘సీఎం వైఎస్‌ జగన్‌ వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. నష్టపోయిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. భారీగా పంటలు నీటమునిగాయి. కొన్నిచోట్ల ఇళ్లు కూడా మునిగిపోయాయి. వరద నీరు తగ్గగానే ఆయా ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తాం’’అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్లకు పైగానే నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు.

నిబంధనల ప్రకారం అందరికీ పరిహారం: మంత్రి కన్నబాబు
వరి, అపరాలు, పత్తి, చిరుధాన్యాలు, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పంట నష్టాలపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోందని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని సీఎం జగన్‌ ఆదేశించినట్లు తెలిపారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టంపై పూర్తి అంచనా వేయడం వీలవుతుందన్నారు. ‘‘భారీ వరదలతో కాల్వలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల పంట పొలాలు, కాలనీలు నీట మునిగాయి. ముంపు బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు బాధితులకు ఆహారం, తాగునీటి సదుపాయం కల్పించాం. నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, ఆయిల్ పంపిణీ చేస్తాం. వరదల ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాం’’అని కన్నబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు