ఎస్సీ గురుకులాల్లో సీబీఎస్‌ఈ బోధన 

6 Sep, 2022 05:09 IST|Sakshi
విద్యాభివృద్ధిని సమీక్షిస్తున్న మంత్రి మేరుగు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున వెల్లడి 

సాక్షి, అమరావతి: ఎస్సీ సంక్షేమ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన ప్రారంభించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధన కోసం టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు.

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో విద్యాబోధన మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ గురుకులాల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రారంభించామన్నారు.

కొత్త విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు గురుకులానికి చెందిన ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు. గురుకుల విద్యార్థులకు బోధన మరింత సరళీకృతం చేసేందుకు డిజిటల్‌ క్లాస్‌ రూములు, వర్చువల్‌ క్లాస్‌ రూముల ద్వారా పాఠాలు చెప్పేందుకు ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. పరీక్షల విధానంలోనూ మార్పులను తెచ్చామన్నారు.

ముఖ్యంగా 9, 10 తరగతులు, ఇంటర్‌ విద్యార్థులకు ప్రతివారం పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, ముందుగా రెండు టెస్ట్‌లు నిర్వహించాకే క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ, ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ విధంగా వారాంతపు పరీక్షలు కాకుండా ప్రధానమైన ఏడు టెస్టులు, పరీక్షలు పెట్టడం ద్వారా విద్యార్థులు వారు విన్న పాఠాలను పూర్తిగా అవగతం చేసుకుని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

విద్యార్థుల్లో పాజిటివ్‌ దృక్పథం కోసం అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్‌ సంస్థలు ముందుకొచ్చాయని, వాటితో త్వరలోనే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, డిప్యూటీ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ బీవీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు