ఎస్సీ, ఎస్టీల దశ మారబోతుంది

27 Oct, 2020 03:04 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేరుగ. చిత్రంలో ఎమ్మెల్యేలు తలారి, జోగారావు

ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, తలారి వెంకట్రావు, జోగారావు

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ‘జగనన్న–వైఎస్సార్‌ బడుగు వికాసం పథకం’తో వారి దశ దిశ మారబోతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, తలారి వెంకట్రావు, జోగారావు అన్నారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ఏపీఐఐసీ భూకేటాయింపుల్లో కూడా వారికి భూములు కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020– 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం దళిత జాతికి దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఇంతకాలం అణచివేతకు గురైన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని, బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలను అమలు పరచడానికి కంకణబద్ధులయ్యారని కొనియాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్‌) ఇస్తున్నారని పేర్కొన్నారు. వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి వందల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో తయారవుతారన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావడం ఎస్సీ, ఎస్టీల అదృష్టమన్నారు. మహానేత వైఎస్సార్‌ పేదలకు, ఎస్సీ, ఎస్టీల కోసం తెచ్చిన ఇండస్ట్రీ పాలసీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు ఏపీలో దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేస్తున్న మేలు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉందన్నారు.  

దేశంలోనే ఉత్తమ విధానం
ఎస్సీ, ఎస్టీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’ పథకం దేశంలోనే అత్యుత్తమమైనది. ఇంత వరకు ఏ రాష్ట్రంలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి గరిష్టంగా కోటి రూపాయల సబ్సిడీ ఇవ్వలేదు. ఇది ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక. దివంగత వైఎస్సార్‌ మొదటిసారి దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ పాలసీ ప్రకటించి చరిత్ర సృష్టించగా, నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ అంతకంటే బెస్ట్‌ పాలసీ ప్రకటించి ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు.    – మామిడి సుదర్శన్, దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు