నెలాఖరున బంగాళాఖాతంలో అల్పపీడనం?

20 Oct, 2021 04:15 IST|Sakshi

ఈ నెల 27 నుంచి ఈశాన్య రుతుపవనాల ప్రవేశం

రాజస్థాన్‌ నుంచి పొడిగాలులు, సముద్రం నుంచి తేమగాలులు

రెండ్రోజులు రాష్ట్రంలో భిన్న వాతావరణం

పగలు ఎండలు, సాయంత్రం జల్లులు కురిసే అవకాశం 

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు రోజులపాటు భిన్న వాతావరణం ఏర్పడనుంది. రాజస్థాన్‌ నుంచి పొడి గాలులు వీస్తుండటం.. అదే సమయంలో సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో బుధ, ఆదివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పగలు ఎండలు, సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గాలిలో తేమ పెరుగుతూ పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోందని, వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ఈ నెల 27 నుంచి ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో 28వ తేదీ తర్వాత నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల్లో బొబ్బిలిలో 55.75 మి.మీ., పరవాడలో 49, లేమర్తిలో 46.25, నాగులుప్పాలపాడులో 44, ఆరిలోవలో 39.25, పరవాడ ఫార్మాసిటీ, మల్లంపేట, నర్సీపట్నంలో 39, దర్శిలో 36 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు