సూక్ష్మ సేద్యం విస్తరిస్తోంది

19 Aug, 2022 03:26 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా గెడ్డంవారిపల్లిలో డ్రిప్‌ పరికరాలతో పంటకు నీరు పెడుతున్న దృశ్యం

ఈ ఏడాది రూ.1,395 కోట్లతో మరో 3.75 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం

కానీ, 4.18 లక్షల ఎకరాల్లో పరికరాల కోసం 1.34 లక్షల మంది ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌

90% సబ్సిడీ మీద బిందు సేద్య పరికరాల సరఫరా

తుంపర సేద్య పరికరాలూ జోరుగా పంపిణీ

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి దిగుబడులు పెరిగే అవకాశం

ఈయన పేరు ఆర్‌. రామ్మోహన్‌రెడ్డి.కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్‌.పేరేముల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.57 ఎకరాల్లో కంది, ఆముదం పంటలు సాగుచేసే వారు. 90 శాతం సబ్సిడీపై బిందు పరికరాల కోసం ఆర్బీకేలో నమోదు చేసుకున్నారు. సర్వేచేసి బిందు సేద్యానికి అనువైనదిగా గుర్తించారు. తన వాటాగా రూ.44,343 చెల్లించారు. దీంతో గతానికంటే భిన్నంగా నేడు ఎలాంటి సిఫార్సుల్లేకుండా దరఖాస్తు చేయగానే వెంటనే పరికరాలు అమర్చారు. ఇప్పుడు కొత్తగా బత్తాయి మొక్కలు వేసుకున్నారు. దీంతో రైతు రామ్మోహన్‌రెడ్డి ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతుభరోసా కేంద్రాల్లో రికార్డు స్థాయిలో రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతో పాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. ఫలితంగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచే దిగుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులు
దేశవ్యాప్తంగా సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు.. 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. సూక్ష్మ సేద్యానికి మరో 28.35 లక్షల ఎకరాలు అనువైనవి కాగా.. దశల వారీగా దీనిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. తొలివిడత కింద 2022–23లో రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడం ద్వారా 1.70 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చాలని నిర్ణయించారు. తద్వారా అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులతో రూ.1,500 కోట్లకు పైగా జీవీఏ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ : అదనపు స్థూల విలువ) సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. 

అనంతపురంలో అత్యధికంగా..
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలకు చెందిన 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు.. 50 శాతం రాయితీపై రాష్ట్రవ్యాప్తంగా తుంపర పరికరాలు అందిస్తున్నారు. పరికరాల సరఫరాకు 37 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు 3,60,120 ఎకరాల్లో బిందు పరికరాల కోసం 1,13,757 మంది.. 57,817 ఎకరాల్లో తుంపర పరికరాల కోసం  20,080 మంది రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.02 లక్షల ఎకరాలకు 28,339 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 76,140 ఎకరాలకు 22,827 మంది, ప్రకాశం జిల్లాలో 37,245 ఎకరాలకు 12,759 మంది, వైఎస్సార్‌ జిల్లాలో 35,780 ఎకరాలకు 11,097 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

డిసెంబర్‌ నాటికి లక్ష్య సాధన
ఈ నేపథ్యంలో.. టెక్నికల్‌ కమిటీలతో క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ చురుగ్గా సాగుతోంది. అర్హుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తయ్యింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అర్హత పొందిన రైతులకు తుంపర పరికరాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. బిందు పరికరాల కోసం ఇప్పటికే 20 వేల ఎకరాల్లో సర్వే పూర్తికాగా, 5వేల ఎకరాల్లో అమరిక పూర్తయ్యింది. పరికరాల అమరిక ప్రక్రియను డిసెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వారం రోజుల్లోనే పరికరాలిచ్చారు.
నేను 2.5 ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నా. 50 శాతం రాయితీపై తుంపర పరికరాలు తీసుకున్నాను. ఆర్బీకేలో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే పొలానికి తీసుకొచ్చి ఇచ్చారు. మిరప సాగు తర్వాత అపరాలు సాగుకు వినియోగిస్తా. 
– శ్యామల సత్యనారాయణరెడ్డి, రామచంద్రపురం, ఎన్టీఆర్‌ జిల్లా

డ్రిప్‌తో రూ.75వేల నికర ఆదాయం
నాకు నీటి సౌకర్యం ఉన్న ఐదెకరాల పొలం ఉంది. డ్రిప్‌ లేకపోతే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు ఖర్చవుతుంది.. పంట దిగుబడి తక్కువగా వస్తుంది. అదే డ్రిప్‌ ఉంటే రూ.15వేలు సరిపోతుంది. ఆదాయం కూడా ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.75వేల వరకు వస్తుంది. 
– చుక్కా లక్ష్మీనారాయణ, రేకులకుంట, అనంతపురం జిల్లా

తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు
నేను 4.91 ఎకరాల్లో నేరేడు పంట సాగుచేస్తున్న. ఆర్బీకేలో దరఖాస్తు చేయగానే సర్వేచేసి మంజూరు ఆర్డర్‌ ఇచ్చారు. ఈ మధ్యే పొలంలో పరికరాలు అమర్చారు. వీటి వినియోగంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషిచేస్తా.
– చమరాతి ప్రమీలమ్మ, ఓదివీడు, అన్నమయ్య జిల్లా

బుడ్డశనగ కూడా వేస్తున్నా..
నేను 2.44 ఎకరాల్లో వేరుశనగ సాగుచేస్తున్నా. సబ్సిడీపై తుంపర పరికరాలు ఇటీవలే అమర్చారు. వీటి ద్వారా వేరుశనగ పంటే కాకుండా బుడ్డశనగ ఇతర పంటలను కూడా సాగుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా.
– సి. రామసుబ్బారెడ్డి, గడ్డంవారిపల్లి, వైఎస్సార్‌ జిల్లా

ఈసారి దిగుబడులు పెరుగుతాయి
సూక్ష్మ సాగునీటి పథకం కింద తుంపర, బిందు పరికరాల కోసం రైతుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. పెద్దఎత్తున రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌ చేరుకున్నారు. అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరిక చురుగ్గా సాగుతోంది. డిసెంబర్‌ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా దిగుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.
– డాక్టర్‌ సీబీ హరనాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు