అమ్మకూ మధ్యాహ్న భోజనం

4 Jul, 2022 09:14 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌/ రాయదుర్గం: అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేవలం చిన్నారులకే భోజనం వడ్డిస్తున్నారు. శుక్రవారం నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,079 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గర్భిణులు 21,480 మంది, బాలింతలు 19,870, ఏడాది లోపు పిల్లలు 20,728, ఏడాది నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,960 , మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,140 మంది ఉన్నారు. రక్తహీనత నివారించడం కోసం వీరికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారం అందిస్తున్నారు.  

నాణ్యమైన భోజనం సరఫరా.. 
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రభ్తుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న సమయంలో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు కూడా రుచికరమైన భోజనం అందించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు చేరాయి. పాల కొరత ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భోజనం తర్వాత తల్లులకు 200 మిల్లీలీటర్లు పాలు, పిల్లలకు 100 ఎంఎల్‌ పాలు తప్పనిసరిగా అందించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు