ఎక్కడికి పోవాలి? 20 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం

6 Dec, 2021 13:48 IST|Sakshi

పరవాడ: కూలి పనులు చేసుకుంటూ.. కుటుంబాలను నెట్టుకొస్తూ  పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్న తమ కుటుంబాలను ఉన్నట్టుండీ   ఖాళీ చేసి పొమ్మంటే తమ గతేమిటని దేశపాత్రునిపాలెం సమీపంలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ స్థలంలో తలదాచుకొంటున్న వలస కూలీలు వాపోతున్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు 20 ఏళ్ల క్రితం స్టీల్‌ ప్లాంటు, పరిసర ప్రాంతాల్లో దొరికే కూలి పనుల కోసం వచ్చాయి. సాయినగర్‌ కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న స్థలంలో   చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో కాలం వెళ్లదీస్తున్నారు.

ఇక్కడ నివసిస్తున్న నిరుపేద కుటుంబాలన్నీ భార్యాభర్తలు కష్టించి పనిచేస్తే తప్ప పొట్ట గడవడం కష్టం.  కొందరు స్టీల్‌ ప్లాంటులో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనులు చేస్తుండగా మరికొందరు భవన నిర్మాణం పనులు, మట్టి పనులకు వెళుతున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో నివాసం ఉంటున్న వలస కూలీలను  ఖాళీ చేసి వెళ్లి పొమ్మని కొంత కాలం నుంచి పవర్‌ గ్రిడ్‌ అధికారులు ఆదేశిస్తుండడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.  పవర్‌ గ్రిడ్‌ యాజమాన్యం తమకు పునరావాసం కల్పించి గుడిసెల తొలగింపు చేపట్టాలని కోరుతున్నారు. 

ఎమ్మెల్యే చొరవ: వసల కూలీల సమస్య తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఇటీవల పవర్‌ గ్రిడ్‌ అధికారులతో మాట్లాడారు. అప్పటినుంచి అధికారులు వత్తిడిచేయడం లేదని తెలిసింది.  

న్యాయం చేయాలి 
నేను, నా భర్త 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా హిరమండలం గరివిడి గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకొని స్టీల్‌ప్లాంటులో కూలి పనులకు వచ్చాం. తన భర్త కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. దేశపాత్రునిపాలెం సమీపంలో ఖాళీ స్థలంలో   చిన్న పూరిగుడిసె నిర్మించుకొని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. ఇంతలో పవర్‌ గ్రిడ్‌ అధికారులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి. – బోర రమణమ్మ, వలస కూలి 


 


పునరావాసం కల్పించాలి 

విజయనగరం జిల్లా గంట్యాడ మండల లక్కిడాం నుంచి 21 ఏళ్ల క్రితం కూలి పనులకు వచ్చి చిన్న పూరి గుడెసె నిర్మించుకొని   కుటుంబంతో తలదాచుకుంటున్నాం.   పునరావాసం కల్పిస్తే తప్ప గుడిసెలు ఖాళీ చేసేదిలేదు.
 – బండారు రమణమ్మ, వలస కూలి 


 

ప్రభుత్వమే ఆదుకోవాలి 
పాతికేళ్ల క్రితం గాజువాక నుంచి చిరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని పొట్టపొషించుకొంటున్నాం. ఇళ్ల పట్టాలిప్పిస్తామని కొందరు పవర్‌ గ్రిడ్‌ హోం గార్డులు తమ వద్ద ఆధార్‌ కార్డులు, నగదు తీసున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ప్రçభుత్వమే ఆదుకోవాలి.
–  నడిపిల్లి అరుణ, చిరు వ్యాపారి

మరిన్ని వార్తలు