అక్కడ పాలు అమ్మబడవు.. ఫ్రీగా పోస్తారు!

25 May, 2021 04:41 IST|Sakshi
గ్రామంలో ఓ వ్యక్తికి ఉచితంగా పాలు పోస్తున్న యువకుడు

గంజిహళ్లిలో అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం

ఎవరెళ్లి అడిగినా ఉచితమే

విక్రయిస్తే ఇబ్బందులొస్తాయంటున్న గ్రామస్తులు

టీ స్టాల్స్‌ నిర్వాహకులూ పొరుగూరు నుంచి తెచ్చుకోవాల్సిందే

కర్నూలు (రాజ్‌విహార్‌): ఆ గ్రామంలో పాడి ఉండే ఏ ఇంటికి వెళ్లినా కావాల్సినన్ని పాలు పోస్తారు. డబ్బు మాత్రం తీసుకోరు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లిలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆ గ్రామంలో సుమారు 1,100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జనాభా 4,750 మంది. గ్రామంలో 120 ఆవులు, 20 వరకు గేదెలు ఉన్నాయి. రోజుకు 800 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి అవుతున్నా ఏ ఒక్కరూ వాటిని విక్రయించడం లేదు. ఎవరైనా వెళ్లి పాలు కావాలని అడిగితే మాత్రం పైసా కూడా తీసుకోకుండా ఇస్తున్నారు. 

బడే సాహెబ్‌ తాత ఆజ్ఞతో..
గంజిహళ్లి గ్రామస్తులు ఆచరించే ఈ సంప్రదాయం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. మూడున్నర శతాబ్దాల క్రితం గ్రామంలో బడే సాహెబ్‌ తాత అనే ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. గ్రామంలో ఆయన పేరిట ఇప్పటికీ ఓ దర్గా ఉంది. ఆ రోజుల్లో ఆయనకు నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంటినుంచి పాలు ఉచితంగా వచ్చేవి. ఒకరోజు బడే సాహెబ్‌ తాత కుమారుడు హుసేన్‌ సాహెబ్‌ పాల కోసం గిన్నెతో నాగిరెడ్డి ఇంటికి వెళ్లాడు. పాలిచ్చే ఆవు చనిపోవడంతో ఖాళీ గిన్నెతో తిరిగొచ్చాడు. పాలు ఎందుకు తీసుకు రాలేదని కుమారుణ్ణి అడగ్గా.. నాగిరెడ్డికి చెందిన ఆవు చనిపోయిందని, గ్రామంలో ఆవులున్న వారిళ్లకు వెళ్లి అడిగినా పాలు పోయలేదని చెబుతాడు.

దీంతో బడే సాహెబ్‌తాత చనిపోయిన ఆవును బతికించి.. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరూ పాలు అమ్మరాదని, ఎన్ని రోజులైనా ఉచితంగానే పోయాలని, ఎవరైనా అమ్మితే ఆ ఇల్లు పాడైపోతుందని శపించాడని చెబుతారు. దీంతోపాటు ఆవును చంపడం, వాటికి పెట్టే గడ్డివాముల్ని తగులబెట్టడం వంటివి చేయొద్దని చెప్పాడట. అప్పట్లో ఒకరిద్దరు పాలను అమ్మడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడంతోపాటు ఆరోగ్య, ఇతరత్రా సమస్యలు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో నాటినుంచి నేటి వరకు ఆవుతో పాటు గేదె, మేక, గొర్రె.. ఇలా వేటి పాలనూ గ్రామస్తులు అమ్మడం లేదు. గ్రామంలోని టీ స్టాల్స్‌ నిర్వాహకులు సైతం పొరుగూళ్లలో పాలను కొనుగోలు చేయడం విశేషం.

శతాబ్దాలుగా ఇదే సంప్రదాయం
బడే సాహెబ్‌ తాత ఆజ్ఞలను గ్రామస్తులంతా తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఏ ఇంట్లోనూ ఆవు, గేదె, మేక, గొర్రె ఇలా ఏ  పాలనూ అమ్మరు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.
– ఎస్‌.సుబహాన్, బడే సాహెబ్‌ తాత వంశీయుడు

కుల, మతాలకు అతీతంగా..
కుల, మతాలకు అతీతంగా ఎవరూ పాలను విక్రయించరు. పాల కోసం వచ్చే వారికి ఎన్ని రోజులైనా ఉచితంగానే పోస్తాం. ఉచితంగా తెచ్చుకోవడం ఇష్టం లేని వాళ్లు ఆవునో, గేదెనో పెంచుకుంటారు. 
 – తిరుమల్‌ రెడ్డి, గ్రామ పెద్ద, గంజిహళ్లి 

చెరకు కూడా నాటరు
బడే సాహెబ్‌ తాత ఆజ్ఞలను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. పాలు అమ్మడం, ఆవును చంపడం, గడ్డి వామి తగులబెట్టడం, చెరకు పంట నాటడం వంటివి ఎవరూ చేయరు.
 – తోలు రాముడు, సర్పంచ్, గంజిహళ్లి 

మరిన్ని వార్తలు