పాల ఉత్పత్తిలో దేశాన్ని అగ్ర స్థానంలో..

26 Nov, 2020 11:59 IST|Sakshi

నేడు వర్గీస్‌ కురియన్‌ జయంతి సందర్భంగా జాతీయ పాల దినోత్సవం  

రాష్ట్రంలో పాల సేకరణకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం  

అమూల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు రైతుల జేజేలు 

రైతులను శక్తి సంపన్నులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు 

సాక్షి, ఒంగోలు‌: దేశంలో క్షీర విప్లవానికి ఆధ్యుడు డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌. పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో నిలబెట్టిన కురియన్‌ జయంతి నేడు. 1921 నవంబర్‌ 26న కేరళ రాష్ట్రంలోని కాలికట్‌లో జన్మించారాయన. దేశ ప్రజలు పౌష్టికాహర లోపంతో బాధపడకుండా కురియన్‌ చేసిన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. ఆయన జయంతిని ‘జాతీయ పాల దినోత్సవం’గా నిర్వహిస్తూ గౌరవిస్తోంది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లోనూ, అమెరికాలోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన ఆయన.. గుజరాత్‌ రాష్ట్రంలోని ఆనంద్‌లో ప్రభుత్వ క్రీమరీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలో చేరారు. నేషనల్‌ డెయిరీ డెవలెప్‌మెంట్‌ బోర్డుకు చైర్మన్‌గా పనిచేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు. రైతుల్ని శక్తి సంపన్నులుగా చేయాలన్న సంకల్పంతో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ప్రస్తుత అమూల్‌)ను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పాలను పౌడర్‌గా మార్చే యంత్రాన్ని కురియన్‌ కనుగొనడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. వర్గీస్‌ కురియన్‌కు లెక్కకు మించిన అవార్డులు అందుకున్నారు. అందులో రామన్‌ మెగసెసే అవార్డు(1963), వాట్‌లర్‌ పీస్‌ ప్రైజ్‌(1986), వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌(1989), పద్మశ్రీ(1965), పద్మభూషణ్‌(1966), పద్మ విభూషణ్‌(1999) ముఖ్యమైనవి. 2012 సెప్టెంబర్‌ 9న 91 ఏళ్ల వయసులో తనువు చాలించారు.  

ఆసియాలోనే అతిపెద్ద డెయిరీ..
ఆసియాలో రూ.52 వేల కోట్ల అతిపెద్ద టర్నోవర్‌ కలిగిన డెయిరీగా అమూల్‌ రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఏజెంట్‌ లేదా కంపెనీల నుంచి కాకుండా కేవలం రైతుల నుంచి మాత్రమే 250 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయడం, ప్రాసెస్‌ చేయడం దీని ప్రాముఖ్యత. ఇంత పెద్ద డెయిరీ యజమాని ఏ వృత్తి నిపుణుడో కాదు. పేరున్న వ్యాపారవేత్త అంతకంటే కాదు. గుజరాత్‌ రాష్ట్రంలోని గ్రామాల్లో నివసించే 3.6 మిలియన్ల మంది రైతులే డెయినీ యజమానులు. ప్రతి రైతు తమ గ్రామ డెయిరీ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఒక లీటరు నుంచి 10 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేయడం ద్వారా అమూల్‌లో సమాన యాజమాన్య వాటా కలిగి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ఈ పాల విప్లవం 74 ఏళ్ల క్రితం 1946లో గుజరాత్‌లో చిన్నదైన కైరా అనే జిల్లాలో ప్రారంభమైంది.  

ఏపీలో అమూల్‌ తరహా ఎంపీయూఎస్‌ఎస్‌లు  
గుజరాత్‌లో అమూల్‌ తరహా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ఎంపీయూఎస్‌ఎస్‌) ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆ సంఘం ద్వారా 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకుంటారు. ఈ 11 మంది సభ్యుల నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. గ్రామ స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ ఏర్పడుతుంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీలు కలిసి రాష్ట్ర కమిటీ ఏర్పాటవుతుంది. 

రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా..  
రాష్ట్రంలో రైతులను సంపన్నులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా అనాధిగా ఉన్న పాడి పరిశ్రమను బలోపేతం చేస్తే రైతు లోగిళ్లు సంతోషంగా ఉంటాయని గట్టిగా నమ్మారాయన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అమూల్‌ సంస్థను రాష్ట్రంలో పాల సేకరణకు రంగంలోకి దించారు. మొదటి ఫేజ్‌లో కేటాయించిన మూడు జిల్లాల్లో ప్రకాశం జిల్లాను చేర్చి ఈ నెల 20వ తేదీ నుంచి 201 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మక పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో అమూల్‌ సంస్థ పాలు సేకరిస్తున్న వైనాన్ని చూస్తున్న ప్రజలు ముఖ్యమంత్రి చర్యలకు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ డెయిరీలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో స్వయంగా ప్రజలు కళ్లారా చూశారు. సొంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి పథంలో నడిపించి ఒంగోలు డెయిరీ లాంటి ప్రభుత్వ డెయిరీలను నష్టాల ఊబిలోకి నెట్టిన పాపం మూటకట్టుకున్నారు. ఆ పరిస్థితి నుంచి డెయిరీ రంగాన్ని బయటపడేసేందుకే  ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గురువారం నుంచి అమూల్‌ పాల సేకరణ కేంద్రాలు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో ప్రారంభం కానున్నాయి.   

మరిన్ని వార్తలు