చిన్నతరహా  ఖనిజాల లీజులకు ఈ–వేలం

9 May, 2022 03:14 IST|Sakshi

11 నుంచి ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో టెండర్‌ పత్రాలు

మొదటి దశగా ఈ నెలలో 200 లీజులకు నోటిఫికేషన్‌

ప్రిఫర్డ్‌ బిడ్డర్‌కు 15 రోజుల్లోనే లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ

మైనింగ్‌ ప్లాన్, ఈసీ, సీఎఫ్‌ఈ సమర్పించిన తక్షణమే లీజులు మంజూరు: గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చిన్నతరహా ఖనిజాల లీజులకు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ వేలం జరగనుంది. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా గనుల శాఖ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. తొలివిడతగా ఈ నెలలో 200 లీజులకు ఈ–వేలం నిర్వహించి అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేశారు. గనుల రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా చిన్నతరహా ఖనిజాలకు ఈ–వేలం ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ–వేలంలో పాల్గొనేందుకు వీలుగా గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ–వేలం నిర్వహించే లీజుల వివరాలు, అవసరమైన టెండర్‌ పత్రాలు ఈ నెల 11వ తేదీ నుంచి ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ https://tender.apeprocurement.gov.inలో అందుబాటులో ఉంచుతారు. లీజులకు సంబంధించిన పూర్తి వివరాలను  https://www.mines.ap. gov.in/ miningportal లద్వారా తెలుసుకోవచ్చు. ఈ–వేలంలో ఎక్కువ మొత్తానికి బిడ్‌ కోట్‌ చేస్తారో ఆ బిడ్డర్‌ (ప్రిఫర్డ్‌ బిడ్డర్‌) తాను కోట్‌ చేసిన మొత్తాన్ని 15 రోజుల్లో గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సొమ్ము చెల్లించిన వెంటనే వారికి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేస్తారు. ఆ తర్వాత బిడ్డర్‌ తాను కోట్‌ చేసిన క్వారీకి సంబంధించిన మైనింగ్‌ ప్లాన్, పర్యావరణ అనుమతి, సీఎఫ్‌ఈ సమర్పించిన వెంటనే లీజులు మంజూరు చేస్తారు.

అనవసర జాప్యం ఉండదు 
తొలివిడతలో 200 లీజులకు ఈ–వేలం ద్వారా అనుమతులు మంజూరు చేస్తాం. ఎక్కడా అనవసర జాప్యం లేకుండా, పారదర్శకంగా లీజుల జారీ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటివరకు మైనింగ్‌ రంగంలోకి రావాలనే ఆసక్తి ఉండి, అవకాశాలు దక్కని వారు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం ద్వారా మైనింగ్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎక్కువ మైనింగ్‌ క్వారీలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు ఖనిజాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. మైనింగ్‌ కార్యక్రమాల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
– వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ  

మరిన్ని వార్తలు