30 రోజుల్లో మైనింగ్‌ అనుమతులు

31 Aug, 2021 02:07 IST|Sakshi

దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరుకు గనుల శాఖ కసరత్తు 

కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా త్వరితగతిన లీజులు

సాక్షి, అమరావతి: పెండింగ్‌లో ఉన్న లీజు దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మోక్షం కలిగించనుంది. కేవలం 30 రోజుల్లో అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర గనుల శాఖ ప్రణాళిక రూపొందించింది. నెలల తరబడి రెవెన్యూ, గనుల శాఖ చుట్టూ తిరిగే పనిలేకుండా నిబంధనల ప్రకారం ఉన్న వాటిని మంజూరు చేయనుంది. ప్రస్తుతం గనుల శాఖలో 18 వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 

వాటిని రద్దుచేసి ఈ–వేలం నిర్వహించాలని తొలుత భావించారు. అయితే.. కోర్టు సమస్యలలో తీవ్ర జాప్యం ఏర్పడే పరిస్థితి ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఉన్న దరఖాస్తుల్లోనే అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకుని నిబంధనల ప్రకారం పక్కాగా ఉన్న లీజులకు 30 రోజుల్లో అనుమతులివ్వాలని నిర్ణయించారు. ఆ లీజుల వార్షిక డెడ్‌ రెంట్‌ (లీజుదారుడు సంవత్సరానికి చెల్లించే ఫీజు)పై పదింతల ప్రీమియం కట్టించుకుని అనుమతులు ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో ప్రస్తుతం వెయ్యి దరఖాస్తులు అన్ని ప్రక్రియలు పూర్తయి మంజూరు దశలో ఉన్నాయి.

వాటికి ప్రీమియం కట్టించుకుని అనుమతులు ఇస్తామని గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ లీజుల ద్వారా ఈ సంవత్సరం సుమారు రూ.500 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతం వచ్చే సంవత్సరం మంజూరు దశకు చేరుకున్నా వాటికీ ప్రీమియం కట్టించుకుని లీజులు ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రతిఏటా రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.   

మరిన్ని వార్తలు