Jagananna Amma Vodi: అమ్మ ఒడిపై ‘ఎల్లో’ విషం

16 Apr, 2022 11:46 IST|Sakshi

పథకం నిబంధనలు మారలేదు.. చూసే కళ్లే మారాయి

విద్యుత్‌ వినియోగ పరిమితిని 200 నుంచి 300 యూనిట్లకు పెంచాం

విద్యార్థుల 75 శాతం హాజరు కూడా పాత నిబంధనే

మరింత ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా చర్యలు

ఏపీ మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకంపై టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్‌ ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతూ లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. ఈ పథకానికి మార్పులు చేస్తూ సర్క్యులర్‌ జారీ చేశారనేది టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం మాత్రమేనని, నిజంగా ఆ సర్క్యులర్‌ ఉంటే బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం కింద రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు.

కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు ఈ పథకంలో అర్హతలకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతం కంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు గతేడాది అర్హత నియమాలు సవరించినట్లు చెప్పారు.

మరింత ఎక్కువ మందికి అందేలా..
ఈ పథకంలో అర్హత కోసం కుటుంబ నెలవారీ ఆదాయం 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఉంటే.. దాన్ని 2020–21లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలకు ప్రభుత్వం పెంచిందని మంత్రి తెలిపారు. ఆ కుటుంబాల భూకమతాలకు సంబంధించి 2019–20లో 2.5 ఎకరాల పొలం మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి కూడా వర్తింపచేసినట్టు తెలిపారు.

ఇంకా 2019–20లో నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే వారినే అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 300 యూనిట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారని, అయితే కొత్తగా శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింపజేశామన్నారు. ఫోర్‌వీలర్‌ రూల్‌ను సవరించి ట్యా క్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా ఇస్తున్నామన్నారు. పట్టణాల్లో గతంలో 700 చదరపు అడుగుల ఇల్లున్న వారు మాత్రమే అర్హులు కాగా.. ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా వర్తింప చేస్తున్నామని వివరించారు.

2 లక్షలకు పైగా పెరిగిన లబ్ధిదారులు
2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. 2020–21లో ఆ సంఖ్య 44,48,865కు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంటే  2,15,767 మంది తల్లులకు అదనంగా పథకంలో ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదని, 75 శాతం హాజరు ఉండాలని తొలి జీవో 63లో నిర్దేశించినట్లు తెలిపారు. హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధన అమలు చేస్తూ ఈ ఏడాది పథకాన్ని జనవరి నుంచి జూన్‌కు మార్చామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే నారా లోకేశ్‌తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు