మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంట్లో విషాదం

26 Dec, 2022 08:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి ఆదిమూలపు థెరీసమ్మ (85) సోమవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున 1:30 నిముషాలకు (తెల్లవారితే సోమవారం) తుదిశ్వాస విడిచారు. థెరీసమ్మకు 5 మంది సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులైన డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శిగా ఉన్నారు.

ఉపాధ్యాయ వృత్తితో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆమెతో పాటు భర్త స్వర్గీయ డాక్టర్ శామ్యూల్  జార్జిలు అంచలంచెలుగా విద్యాసంస్థల అధినేతల వరకు ఎదిగి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలను మార్కాపురంలో నెలకొల్పారు. స్వర్గీయ డాక్టర్ శామ్యూల్ జార్జి పశ్చిమ ప్రాంత విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. థెరీసమ్మ మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పని చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి థెరీసమ్మ ఎనలేని కృషి చేశారు. ఉపాధ్యాయ వృత్తితో విశేష సేవలు అందించారు.

అటు కర్నూలు జిల్లాలో, ఇటు ప్రకాశం జిల్లాలో  విద్యాసంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నర్సింగ్, బీఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది విద్యార్థుల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. డాక్టర్ శ్యామ్యూల్ జార్జి మృతి తర్వాత విద్యాసంస్థల చైర్పర్సన్ గా థెరీసమ్మ ఇప్పటివరకు వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన ఆమె సోమవారం మృతి చెందారు. థెరీసమ్మ మృతితో అటు కర్నూలు ఇటు ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

చదవండి: (సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు సంతృప్తికరంగా లేదు)

మరిన్ని వార్తలు