పేదల సొంతింటి కలను నిజం చేస్తాం

15 Aug, 2020 10:05 IST|Sakshi

స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం ఆయన 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తూ 30 లక్షల మంది నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మన దేశానికి స్వతంత్రం రావడం వెనుక ఎంతో మంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయని, వారందరినీ స్మరించుకోవాలన్నారు. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటలు నేడు అక్షరాల నిజమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిన ఘనత సీఎం వైఎస్ జగన్​కే దక్కుతుందన్నారు. (జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌) 

వైఎస్సార్‌ జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, పులివెందుల ప్రాంతంలో అరటి పరిశోధనా కేంద్రం, కోడూరు ప్రాంతంలో ఉద్యాన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ‘‘మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభించాం. క్యాన్సర్ బాధితులు కోసం కడపలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అన్న నినాదంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. వైఎసార్ కంటివెలుగు ద్వారా విద్యార్థులకు మెరుగైన కంటిచూపు చికిత్స కోసం చర్యలు తీసుకున్నామని’  ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్ జిల్లాలో రైతులకు సాగునీటితో పాటు అనేక గ్రామాలకు తాగునీరు అందించే దిశగా అనేక ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, కాలువల తవ్వకం ద్వారా ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు చేపట్టామని మంత్రి సురేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు