వారివి పసలేని విమర్శలు: ఆళ్ల నాని

23 Jan, 2021 20:05 IST|Sakshi

అదుపులో అంతుచిక్కని వింత వ్యాధి

వ్యాధి నివారణ చర్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలతో చర్చించిన మంత్రి ఆళ్ల నాని

సాక్షి, ఏలూరు: అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు చేపట్టడంతో ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఈ వ్యాధి ప్రభావం పూర్తి స్థాయిలో అదుపులో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొట్టారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసు బాబులతో వింత వ్యాధి నివారణపై అనుసరించవలసిన విధానం పై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వారం రోజులుగా భీమడోలు మండలం పూళ్ళ, దెందులూరు మండలం కోమిరేపల్లి గ్రామంలో వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన ప్రజలకు అండగా నిలబడి పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల పై ప్రత్యేకంగా వైద్య బృందాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: 8 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డు 

వింత వ్యాధికి గురై డిశార్జ్‌ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని ఇంటింటికి సర్వే కొనసాగుతుందని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని..  ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించామని జాతీయ రహదారి వెంబడి హైవే పై ఉన్న గ్రామాలలో ఈ వింత వ్యాధి కనిపించడం పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని, కెనాల్ ద్వారా నీటి సరఫరాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని కూడా రూరల్ వాటర్ స్కీం అధికారులు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ.. 

ప్రజలు వింత వ్యాధితో అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉంటే కొంతమంది రాజకీయ స్వార్థంతో పసలేని విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలు కంటే రాజకీయ కోణం కంటే ప్రజల ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు అండగా ఉంటే బాగుంటుందని రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అవగాహన లేని రాజకీయ ప్రకటనలు చేసే వారు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆళ్ల నాని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించాలని అనారోగ్య బారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైపే మొగ్గు చూపుతున్నారని దీన్నిబట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సదుపాయాలు ఎంత సక్రమంగా అందుతున్నాయో అర్థమవుతుందని ప్రతిదానిని రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానం అవుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా  ప్రత్యేక దృష్టి పెట్టామని అన్ని గ్రామ పంచాయతీలు ఏలూరు కార్పొరేషన్లో పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి మురుగు కాలువలలో ఉన్న పూడికను తొలగించడానికి అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు