ఏపీ: 24 గంటల్లోనే కోవిడ్‌ టెస్టుల ఫలితాలు

30 Apr, 2021 08:10 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చిత్రంలో సింఘాల్‌

పది రోజుల్లో 80 వేలకు టెస్టులు పెంచగలిగాం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

వెయ్యి పడకలతో ఆస్పత్రి ఏర్పాటుకు ముందుకొచ్చిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌: సింఘాల్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఫలితాలను 24 గంటల్లోనే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్‌ అవసరమైన సమయంలో ఆటంకాలు లేకుండా నిర్వహణ కోసం రూ.30 కోట్లు విడుదల చేయనున్నామని తెలిపారు. కరోనా బాధితుల నుంచి ఆస్పత్రుల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయకుండా కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

3 గంటల్లోనే పడక ఇచ్చేలా చర్యలు
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారీగా టెస్టుల సంఖ్య పెంచామని, పది రోజుల్లోనే 30 వేల నుంచి 80 వేలకు పెంచామన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉండే బాధితులను రోజూ ఏఎన్‌ఎం.. ఆశా కార్యకర్తలు పర్యవేక్షించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. 104ను బలోపేతం చేసి 3 గంటల్లోనే పడక ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తక్కువ స్థాయిలో లక్షణాలున్నవారికి కోవిడ్‌ కేర్‌సెంటర్లలో సేవలు అందిస్తామని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ సేవలకు రోజుకు రూ.3,250, తీవ్ర అనారోగ్యంగా ఉన్న వారికి రూ.10,380 ఫీజులను ప్రభుత్వ నిర్ణయించిందని, ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి రూ.16 వేల వరకు పెంచుతున్నామన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను భారీగా పెంచుతున్నామని వెల్లడించారు. కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో వెయ్యి పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ముందుకొచ్చిందని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌సింఘాల్‌ తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సేవలు అందుతాయని, ఆక్సిజన్‌ సరఫరాకు మరిన్ని ట్యాంకర్లు వినియోగిస్తున్నామన్నారు.

15 అంశాలతో ముందుకెళ్లాలి: జవహర్‌రెడ్డి
కోవిడ్‌ నియంత్రణకు 15 అంశాలతో ముందుకెళ్లాలని స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. 104 కాల్‌సెంటర్, టెస్టులు పెంచడం, ఫలితాలు త్వరగా వెల్లడించడం, రోజూ ఒక నిపుణుడితో అవగాహన కల్పించడం వంటి అంశాలను ఆయన అధికారులకు సూచించారు.

చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ 
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్‌ సీపీదే హవా

మరిన్ని వార్తలు