బాధితులకు అండగా ఉంటాం.. ఆందోళన చెందవద్దు

6 Dec, 2020 11:45 IST|Sakshi

సాక్షి, ఏలూరు : అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఆదివారం ఉదయం మరోసారి పరామర్శించారు. వార్డులో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయి.ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారు. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు. (ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ ఆరా)

కేసుల వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడ తరలించాం. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్‌ చేశారు. ఘటనపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చక్కబడే వరకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. బాధితులకు బాసటగా ఉంటాం. ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ఎవరు భయపడవద్దు. ప్రత్యేక వైద్య బృందాలను ఏలూరు పంపించి వ్యాధి లక్షణాలపై పరీక్షలు చేస్తామని ముఖ్యమంత్రి ఆదేశించారు. (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత)

ఎవరికీ ప్రాణపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స అనంతరం సాధారణ స్థితికి వస్తున్నారు. నీటి నమూనా సేకరించిన రాష్ట్ర స్థాయి ల్యాబ్‌కు పంపాం. నీటిలో కాలుష్యం లేదని నివేదికలో తేలింది. బాధితుల రక్త నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. ఎలాంటి వైరస్‌ కారణాలు లేవని తేలింది. మరికొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చాక కారణాలు తెలుస్తాయి. ఈ పరిస్థితికి కారణాలను ఆన్వేషిస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని  అంతుచిక్కని వ్యాధిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరెండెంటెంట్‌, డీఎంహెచ్‌వో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

మరిన్ని వార్తలు