ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్‌ బాషా హర్షం

15 May, 2021 13:04 IST|Sakshi

ఏపీ మత సామరస్యానికి ప్రతీక

డిప్యూటీ సీఎం అంజాద్‌  బాషా 

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్‌  బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు  లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు.

‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్‌  బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ
ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి

మరిన్ని వార్తలు