టీడీపీ మంత్రులు ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు?

26 Oct, 2020 12:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందెవరో, పరుగులు పెట్టిస్తోంది ఎవరో ప్రజలకు తెలుసునని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. '2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రెండేళ్ల పాటు పోలవరాన్ని పట్టించుకోలేదు. అనంతరం 2016లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని టీడీపీ స్వాగతించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టును ప్యాకేజీ పరిధిలోకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ అభ్యర్ధన మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పజెప్పారు. ప్యాకేజీల కోసమే చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు.

ప్యాకేజీలో ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. 2014లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని బాబు కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమంటూ 2017లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ఆ సమయంలో కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. సవరించిన అంచనాలను అంగీకరించమని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ మంత్రులు ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు..?.   (పోలవరానికి నిధులు రాబట్టండి)

చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఈ రోజు కేంద్రం కొర్రీలు వేస్తోంది. టీడీపీ ఈ రోజు సిగ్గులేకుండా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు..?. ప్రతి సోమవారం పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారు..?. లక్ష మంది నిరాశ్రయ కుటుంబాల గురించి ఎందుకు ఆలోచించలేదు..?. ప్రాజెక్టు నిర్వాసితులను కచ్చితంగా ఆదుకోవాల్సిందే. ఈ విషయాలన్నింటిపైనా త్వరలో ప్రధాని మోదీని కూడా కలుస్తాం. ఆ మేరకు పోలవరంపై కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ కూడా రాస్తారు' అని మంత్రి అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు