మహిళ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి అవంతి

3 Aug, 2020 15:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రి విమ్స్‌ను మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విమ్స్‌లో లోపాలపై బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. తన భర్త చనిపోయినా సమాచారం ఇవ్వలేదంటూ ఓ మహిళ  ఆరోపించగా విమ్స్‌లో వైద్య సిబ్బంది కొరత ఉందని అన్నారు. దాంతోనే సమాచారం లోపం తలెత్తిందని చెప్పారు. దీనిపై విచారణ కమిటీ వేశామని తెలిపారు. ఇప్పటివరకు కోవిడ్‌ బాధితుల ఫోన్‌ నెంబర్లు మాత్రమే రిజిస్టర్‌ చేస్తున్నారని, బాధితుడు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు సమాచారం అందడంలేదని తెలిపారు. ఇకపై కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యుల పోన్‌ నెంబర్లు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. విమ్స్‌లో సమాచారం లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
(చదవండి: వినయ విధేయ తహసీల్దార్‌)

ఇప్పుటివరకు విమ్స్‌లో 180 మంది కరోనాతో చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం 595 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 300 పైగా డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 80 మంది మాత్రమే ఉన్నారని, వారు కుడా ఓ వారం పనిచేసి మరో వారం హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారని తెలిపారు. కొంతమంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని మంత్రి గుర్తు చేశారు. వైద్య సిబ్బంది పని చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కోవిడ్‌ సమయంలో పని చేయడానికి వైద్యులు, నర్సులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. విమ్స్‌ ఆస్పత్రి, వైద్యులపై తప్పుడు ప్రచారం తగదని హితవు పలికారు. మీడియా కూడా తప్పుడు వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకూడదని కోరారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు.  
(తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : విమ్స్ డైరెక్టర్)

మరిన్ని వార్తలు