రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి

17 Jul, 2021 12:35 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌

సాక్షి,ఒంగోలు అర్బన్‌: రైతులు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రైతులను అన్నీ రకాలుగా ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా అందడంలేదని, అక్రమంగా తెలంగాణకు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు ఎందుకు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించడని అన్నారు. ఓటుకు నోటు కేసు తిరగతోడతారని చంద్రబాబుకు భయం అన్నారు.

చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన హయాంలో రైతులకు ఏం చేశారో, నీటి వాటాలపై తెలంగాణ వైఖరిపై మాట్లాడాలని సవాల్‌ విసిరారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా గురించి మాట్లాడితే రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలతో జిల్లా ఎడారిగా మారుతుందని మాట్లాడించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లాలో రైతుల గురించి కాని, నీటి సరఫరా గురించి కాని మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ హైదరాబాదులో బాబుని కలిసి స్క్రిప్ట్‌ తీసుకొచ్చి మీడియా ముందు చదివారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టిలో అన్నీ జిల్లాలు సమానమేనని, అన్నీ జిల్లాలకు సమ న్యాయం జరుగుతుందని చెప్పారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి నీటి పంపకాల్లో న్యాయం చేస్తే మంచిదన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నారు.   

ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్న చంద్రబాబు: మంత్రి ఆదిమూలపు సురేష్‌  
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు మధ్య చంద్రబాబు ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్నారని అన్నారు. చట్ట బద్ధంగా రాష్ట్రానికి అందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా ఎక్కువ అవసరం లేదని, అదేవిధంగా ఒక్క చుక్క తగ్గినా ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ ప్రజలకు నీరు ఇవ్వకూడదా... రాయలసీమ రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదా చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లా ఎడారి అవుతుందని మాట్లాడించడం అన్యాయమన్నారు.

ఆయన హయాంలో జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివరకు మొదటి టన్నెల్‌ ప్రారంభించి నీటి విడుదల చేస్తామన్నారు. రెండో టన్నెల్‌ పనులతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి, పునరావాస కాలనీల పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మంత్రులతో పాటు వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు