ఆ ధాన్యం సంగతేంటి! 

29 Aug, 2020 12:39 IST|Sakshi
ఓ మిల్లు వద్ద ఉన్న ధాన్యం నిల్వలు

మిల్లుల్లో మూలుగుతున్న 5,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం 

తీసుకున్నట్టు చూపని మిల్లర్లు

బిల్లులు అందక రైతుల ఆందోళన 

మంత్రి బొత్స దృష్టికి సమస్య

పరిష్కారం చూపాలని అధికారులకు మంత్రి ఆదేశం 

విజయనగరం గంటస్తంభం: ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి... ప్రతి గింజకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, మిల్లర్లు, అధికారుల వైఫల్యం వల్ల రబీ ధాన్యం బిల్లులు సకాలంలో అందక రైతులు ఆందో ళన చెందుతున్నారు. దీనిపై మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని బిల్లులు చెల్లింపునకు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు.  

మిల్లుల్లో ధాన్యం ఉన్నా...  
రబీలో కొనుగోలు చేసినట్లు అధికారులు చూపుతు న్న ధాన్యం, సీఎంఆర్‌ విషయం పక్కన పెడితే మిల్లుల్లో ఉన్న రైతుల ధాన్యంపై సమస్య తలెత్తింది. జిల్లాలో అనేక మంది రైతులకు చెందిన 5,400 మెట్రిక్‌ టన్నులు ధాన్యం మిల్లుల్లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని నమోదు చేసి మిల్లులకు పంపించారు. మిల్లర్లు మాత్రం వాటిని తీసుకున్నట్లు చూపడం లేదు. దీంతో ఆయా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.8.81 కోట్లు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం అక్కడ సిబ్బంది నమోదు చేసి మిల్లుల కు పంపించాలి. మిల్లర్లు వాటిని తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఓకే చేస్తే రైతులకు బిల్లులు రెండు రోజుల్లో పడిపోతాయి.  

25 మిల్లుల్లో సమస్య  
రబీలో కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాలోని 77 మిల్లులకు తరలించారు. ఇందులో 52 మిల్లులకు తరలించిన ధాన్యం మిల్లర్లు తీసుకున్నట్టు చూపడంతో బిల్లులు కూడా రైతుల ఖాతాల్లో పడిపోయాయి. కానీ 25 మిల్లులకు తరలించిన 5,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పెండింగ్‌లోనే ఉన్నాయి. మిల్లర్లు వాటిని తీసుకున్న చూపడంలేదు. ఆ మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ మేరకు ఇప్పటికే వారికి ధాన్యం ఇచ్చారు. వాటిని మరపట్టి ఇస్తే మిగతా ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంది. అయితే, ఇప్పటికే ఆయా మిల్లర్లు 5వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యానికి సంబంధించి బియ్యం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా ఈధాన్యం తీసుకోలేని పరిస్థితి. అయితే, అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఆమేరకు 1:4 నిష్పత్తిలో ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆపని కూడా మిల్లర్లు చేయడం లేదు. దీంతో ఆ మిల్లులకు చేరినా మిల్లర్లు ఓకే చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగని పరిస్థితి తలెత్తింది.  

మంత్రి దృష్టికి సమస్య 
ధాన్యం బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు వైఫల్యం కూడా ఉంది. బ్యాంకు గ్యారంటీ పరిశీలించకుండా మిల్లులకు అంతకుమించి ధాన్యం పంపించారు. వాస్తవానికి కొనుగోలు పక్రియ లోటుపాట్లపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు.. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై భారం పడేసి చోద్యం చూశారు. దీంతో మిల్లులకు ధాన్యం చేరి అక్కడ మూడు నాలుగు నెలలుగా మూలుగుతున్నా రైతులకు మాత్రం బిల్లులు అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయం చివరకు జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అధికారులను పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ విషయంపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఇటీవల విజెలెన్స్‌ ఎస్పీ జిల్లాకు వచ్చి మిల్లర్లు, అధికారులతో సమావేశం పెట్టి వెళ్లారు. మిల్లుల్లో ఉన్న 5వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి బిల్లులు చెల్లించాలంటే వాటిని స్వీకరించాలని, ఇందుకు గతంలో ఇచ్చిన ధాన్యానికి పెండింగ్‌లో సీఎంఆర్‌ ఇవ్వాలని, లేకుంటే అదనపు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన మిల్లర్లు పెండింగ్‌ సీఎంఆర్‌ వెంటనే ఇచ్చి మిల్లుల్లో ఉన్న ధాన్యం ఆన్‌లైన్‌లో ఓకే చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లయింది.  

సమస్య పరిష్కరిస్తాం.. 
మిల్లర్లు వద్ద ఇంకా 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ లేక వారు ఓకే చేయలే దు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు సమన్వయ సమావేశం ఇటీవల జరిగింది. పాత కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) వేగంగా ఇచ్చి ఈ ధాన్యం తీసుకుంటామని మిల్లర్లు హామీ ఇచ్చారు. సమస్య తొందరలోనే పరిష్కారమవుతుంది. రైతుల కు ఇబ్బందులు లేకుండా చేస్తాం. 
– వరకుమార్, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల సంస్థ 

మరిన్ని వార్తలు