ఉచిత విద్యుత్‌ నగదు బదిలీతో రైతులకు మేలు

5 Sep, 2020 18:30 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లి: రైతులకు మేలు చేసేందు‍కే ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను మరింత పకడ్బందీగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. (చదవండి: సీఎం జగన్‌ సంకల్పం.. ఏపీ నెంబర్‌వన్‌)

‘‘ప్రజలకు మేలు జరుగుతుందని నగదు బదిలీ చేస్తున్నారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగానే నగదు బదిలీ నిర్ణయం తీసుకున్నారు. మీటర్లు డిస్కంలు ఏర్పాటు చేస్తాయి. మీటర్లకు రైతులు ఒక పైసా కట్టనక్కరలేదు. ఉచిత విద్యుత్‌తో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. నగదు బదిలీ కాదు ఉరి తాడు అంటున్నారు. నగదు బదిలీ గురించి 2014 ఎన్నికలకు ముందు గొప్పగా చంద్రబాబు చెప్పారు. నగదు బదిలీ పథకాన్ని లోకేష్ రూపకల్పన చేశారన్నారు. నగదు బదిలీ డబ్బు డిస్కంలకు వెళ్తుంది. రైతులు వాడడానికి, బ్యాంక్‌లు జమ చేసుకోవడానికి వీల్లేదు. నగదు జమ వలన ఎంత విద్యుత్ ఉపయోగించామో తెలుస్తోంది. నాణ్యమైన విద్యుత్ అడగడానికి అవకాశం రైతులకు ఉంటుంది. చంద్రబాబు పోరాటం వలన ఉచిత విద్యుత్ వచ్చిందని చంద్రబాబు సిగ్గు లేకుండా చెపుతున్నారని’’  బొత్స దుయ్యబట్టారు.

ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోయిన వైఎస్సార్‌ ఒప్పించారని, రైతులకు మేలు జరుగుతుందని అధిష్ఠానంపై పోరాటం చేసి మేనిఫెస్టోలో పెట్టారని ఆయన వివరించారు. విద్యుత్ బకాయిలు కట్టలేదని రైతులను జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుదని ధ్వజమెత్తారు. బషీరాబాగ్‌లో రైతులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించింది చంద్రబాబు కాదా.. ? విద్యుత్ ఉద్యమానికి సంబంధించి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి దీక్ష చేస్తే శిబిరం మీద పొగ బాంబులు వేయించలేదా..? రైతులపై ప్రేమ ఉంటే 50 రూపాయల హార్స్ పవర్‌ను ఎందుకు 650కి పెంచారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలు మీద బట్టలు వేసుకోవాలని చంద్రబాబు చెప్పలేదా.. వ్యవసాయం దండగని ఆయన మాట్లాడటం వాస్తవం కాదా.. అంటూ మంత్రి బొత్స  ప్రశ్నించారు. (చదవండి: ‘చంద్రబాబు రాజకీయ నిరాశ్రయుడు’)

చంద్రబాబు చేసిన దాష్టికాలకు తానే సాక్షినని, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూశారని తెలిపారు. సోలార్ విద్యుత్ ఎక్కువ రేటుకు కమిషన్లు కోసం చంద్రబాబు కొనలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు గతం మరిచి మాట్లాడుతున్నారు. పెట్టుబడులపై సంస్కరణలపై దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ‘ఈజీ ఆఫ్ డూయింగ్’లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.. దీనికి కారణం పరిశ్రమలకు ప్రోత్సాహకాలే కదా. ఈజీ ఆఫ్ డ్యూయింగ్ మొదటి స్థానం రావడానికి విద్యుత్ సంస్కరణలే కారణమని ఆయన తెలిపారు 

‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నుంచి ఎంత అప్ప ఉందొ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానికి మూడు రెట్లు అప్పు చేశారు. చంద్రబాబు ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. పేదలకు మేలు చేయకూడదనేది చంద్రబాబు సిద్ధాంతం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రైతే వెన్నెముక’’ అని తెలిపారు. చంద్రబాబు జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆయన అనుకున్నట్లు ఎన్నికలు జరగవు. రాజ్యాంగం ప్రకారం ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పడానికి చంద్రబాబు ఏమైనా దేవ దూతనా అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరిగితే మరో ఐదేళ్లు చంద్రబాబు ప్రతిపక్షమేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు