అమరావతి 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగం: మంత్రి బొత్స

25 Feb, 2021 18:53 IST|Sakshi

తాడేపల్లి: మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్మాణాలపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు. అమరావతిలోని 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగమేనని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేయడానికి రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాయలంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘తాత్కాలిక భవనాలకే చంద్రబాబు వందల కోట్లు వృధా చేశారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టి రోడ్లు కూడా వేయలేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు చంద్రబాబు గ్రాఫిక్స్‌లో ఓ భాగం. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి అరకొరగా ఆ రోడ్డు వేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డును కాజా వరకు విస్తరించాలని ప్రణాళికలు వేస్తున్నాం. అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీగా ఎందుకు చేయలేదు?అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కి విర్రవీగితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. విశాఖలో భవనాలు కడుతుంటే ఎందుకు స్టే తెచ్చారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దుతాం’ అని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు