వెలుగు రేఖ జగన్‌

25 Jun, 2022 08:33 IST|Sakshi

పలాస/కాశీబుగ్గ: నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెలుగు రేఖలా కనిపిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో తిత్లీ తుపాను బాధితులకు అదనపు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో కూడు, గూడు, గుడ్డ కోసం బొడ్డపాడులో ఎన్నో ఉద్యమాలు చేశారని, సీఎం వైఎస్‌ జగన్‌ వాటిని ఏ పోరాటం లేకుండా అర్హులకు అందిస్తున్నారని ధర్మాన చెప్పారు. అందరికంటే పెద్ద కమ్యూనిస్టు వైఎస్‌ జగనేనని ఓ మిత్రుడు తనతో చెప్పాడని, అదే నిజమని అన్నారు. గత మూడేళ్లలో ప్రజల ఖాతాలకు రూ.లక్షా నలభై వేల కోట్ల నగదు జమ చేసిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. 

అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని అన్నారు. టీడీపీ హయాంలో కేవలం కార్యకర్తలకే పథకాలు అందేవని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తలెత్తుకునేలా సీఎం పనితీరు ఉందన్నారు. త్వరలోనే హిరమండలం నుంచి ఉద్దానంకు నీరు అందించనున్నట్లు తెలిపారు.

ఉద్దానంలో ఎందరో నాయకులు పర్యటించారని, కానీ వైఎస్‌ జగన్‌ వచ్చాక మాత్రమే డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటు, రూ.200 కోట్లతో పలాస ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలకు అవకాశం లేకుండా సీఎం పరిపాలన సాగుతోందని, చంద్రబాబుకు ఇది మింగుడు పడడం లేదని అన్నారు. తిత్లీ తుపాను బాధితులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా సాయం చేసేలా ప్రతిపాదన పెడతామన్నారు. విద్యార్థుల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకు విద్యకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నామని, అమ్మ ఒడి, ప్రభుత్వ బడులు బాగు చేయడం వంటి పలు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఇచ్చిన మాట ప్రకారం సీఎం నిధులిచ్చారు
జిల్లాలోని 90,789 మంది జీడి, కొబ్బరి రైతులకు రూ.182.60 కోట్ల అదనపు పరిహారం చెల్లించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఉద్దానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.700 కోట్లతో శుద్ధ జలాలు అందించే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హెక్టారు జీడి పంటకు నష్ట పరిహారాన్ని రూ.30,000ల నుంచి రూ.50,000లు, కొబ్బరి చెట్టుకి రూ.1,500 నుంచి రూ.3,000కి పెంచి చెల్లింపులు చేసినట్లు వివరించారు. 
 

మరిన్ని వార్తలు