సొంత గనులు లేకనే స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు

10 Mar, 2021 19:33 IST|Sakshi

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

ఢిల్లీ: సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలకు కారణాలలో ఒకటని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ.. సొంత ఇనుప ఖనిజం గనులు లేనందున విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మార్కెట్‌ ధరలకు బహిరంగ మార్కెట్లో ఇనుప ఖనిజం కొనుగోలు చేయవలసి వస్తోందని, స్టీల్‌ ప్లాంట్‌కు వాటిల్లితున్న నష్టాలకు కారణాలలో ఇది ఒకటని తెలిపారు. ఇనుప ఖనిజం గనులను రిజర్వ్‌ చేయవలసిందిగా కేంద్రంలోని గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవలసిందిగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఒడిషా, చత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. దీంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఇనుప ఖనిజం గనిని రిజర్వ్‌ చేయవలసిందిగా గనుల మంత్రిత్వ శాఖ ఒడిషా ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

గడచిన అయిదేళ్ళ కాలంలో పర్బత్‌పూర్‌, సితనాలాలోని బొగ్గు, ఇనుప ఖనిజం గనులను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు కేటాయించడం జరిగింది.అయితే ఈ గనులను సెయిల్‌ తిరిగి స్వాధీనం చేయడంతో ఆ కేటాయింపులను రద్దు చేయడం జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే ఒడిషాలోని థాకురాని బ్లాక్‌ ఏ, రమణదుర్గ ఫారెస్ట్‌ రేంజ్‌లోని బ్లాక్‌ 31లోని ఇనుప ఖనిజం గనులను 2004, 20019లో సెయిల్‌ పేరిట రిజర్వ్‌ చేసినందున ఒడిషా ప్రభుత్వం మూడేళ్ళ పాటు ఆయా బ్లాకుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బొగ్గు మంత్రిత్వ శాఖ 2020 మార్చిలో  జార్ఘండ్‌లోని రబోధి కోల్‌ గనిని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు సూత్రప్రాయంగా కేటాయించిందని మంత్రి తెలిపారు.

చదవండి: 
స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతదూరమైనా వెళ్తాం

 ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు

మరిన్ని వార్తలు