రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్‌ సరఫరా: మంత్రి గౌతమ్‌రెడ్డి

6 May, 2021 16:52 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తామని మంత్రి గౌతమ్‌ రెడ్డి అన్నారు. మరో 100 ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో రోగులు కోలుకోవడానికి ఇచ్చే ఔషధాల సరఫరా, డిమాండ్, ఐసొలేషన్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్తో మంత్రి మేకపాటి గురువారం చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జీజీహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, ప్రజల ఇబ్బందులు, కరుణ సోకిన వారి ఆరోగ్య  పరిస్థితులపై ఆరా తీశారు.

అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అందుబాటులో ఉన్నప్పుడే ప్రజాసేవకు అసలైన గుర్తింపని, మండలస్థాయిలో ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నోడల్ అధికారులు అందుబాటులో ఉండి  ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని, ఆక్సిజన్‌ అత్యవసర సమయంలోనే అవసరమనుకుంటేనే వినియోగించాలని అన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా కోవిడ్ వచ్చిన వారికి అవగాహన కల్పించడం కూడా అవసరమన్నారు.

మరిన్ని వార్తలు