తక్షణమే సీడ్స్‌ కంపెనీ మూసివేతకు ఆదేశాలు: మంత్రి అమర్‌నాథ్

3 Aug, 2022 10:38 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహరెడ్డి ఆదేశించారు.

అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్‌ లీకైన ఘటనపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు.  జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
చదవండి: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్‌ లీక్‌ 


సీడ్స్‌ యూనిట్‌లో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని అయిదు ఆసుపత్రుల్లో జాయిన్‌ చేశామని, బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్‌ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్‌ఆర్‌కు పంపుతున్నట్లు చెప్పారు. 

జరిగిన తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని వెల్లడించారు. రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ప్రమాదం జరిగిందని గుర్తుచేసిన మంత్రి దీనిపై కమిటీ వేశామని, ఇంకా విచారణ జరుగుతుందన్నారు. గత ప్రమాదంలో క్లోరిఫైపాలిష్ అనే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై సీడ్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు.

మరిన్ని వార్తలు