అప్పటి నుంచే విశాఖ కేంద్రంగా పాలన: మంత్రి అమర్నాథ్‌

16 Sep, 2022 18:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన సాగించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో పరిశ్రమల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించామన్నారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు గౌరవం, చిత్తశుద్ది లేవన్నారు. 

'టీడీపీ నేతల తీరు సభకు వచ్చామా.. వెళ్లామా అనేలా ఉంది. ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌లో చంద్రబాబు ఘనుడు. పరిశ్రమలను ఎలా అమ్మేశాడో గతంలో చూశాం. ఎంఎస్ఎమ్ఈల ద్వారా 2 లక్షల 11 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. మరో లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. బీచ్ ఐటీని అభివృద్ది చేస్తాం. ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ మెంట్ మీట్ నిర్వహిస్తాం. ఈ మీట్ లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తాం. గతంలో కంటే మా హయాంలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరిగింది.

రాష్ట్రంలోని అన్ని నగరాల్లో విశాఖ ప్రధాన నగరం. దేశంలోని టాప్ టెన్ నగరాల లిస్ట్‌లో విశాఖ ఉంది. విశాఖపట్నంలో జరిగే లావాదేవీల్లో తప్పేముంది. 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులపై సీఎం మా వైఖరి చెప్పారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ట్రాన్సాక్షన్స్ నిరూపించండి. ఆధారాలుంటే తీసుకురండి. విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోం. ఏమీ లేని అమరావతిలో రోడ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. యాత్ర పేరుతో  విధ్వంసం సృష్టించాలని చూస్తే చంద్రబాబే బాధ్యుడవుతాడని హెచ్చరించారు. సవాళ్లు విసరడం దేనికి.. టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనండి అప్పుడు ప్రజలు ఎవరివైపు ఉంటారో చూద్దాం' అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. 

చదవండి: (ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు