ఫార్మా పార్కుపై రాజకీయాలు దుర్మార్గం

3 Sep, 2022 03:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఫార్మా పరిశ్రమ హబ్‌గా రాష్ట్రం నిలవనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఏపీకి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. శుక్రవారమిక్కడ సర్క్యూట్‌ హౌస్‌లో మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ అంటే చంద్రబాబు, యనమల రామకృష్ణుడికి వెన్నుపోటు పొడిచేందుకు అనుకూలమైన రోజని వ్యాఖ్యానించారు. 1995లో చెట్టు కింద ప్లీడర్‌ను ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, స్పీకర్‌గా చేసి రాజకీయ భవిష్యత్‌ ప్రసాదించిన ఎన్టీఆర్‌కు  వెన్నుపోటు పొడిచిన ఘనత యనమలకే దక్కుతుందన్నారు.

మూడున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ పదవులు కట్టబెట్టిన సొంత జిల్లాకు బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌ వస్తే అడ్డుకుంటూ లేఖలు రాసి మరోసారి వెన్నుపోటుదారుడిగా నిరూపించుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, యనమలను రాష్ట్రం నుంచి ప్రజలు బహిష్కరించాలన్నారు. టీడీపీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా చంద్రబాబును పూర్తిగా మరిచిపోయారన్నారు. జైలుకు వెళ్లిన వారికే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోవడంపై తాము కసరత్తు చేస్తుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు కుప్పంలో ఎలా నెగ్గాలో మల్లగుల్లాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ నియోజకవర్గం దొరక్క చివరికి హిందూపురం నుంచి పోటీ చేయడానికి కోడలిని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

అమర్‌రాజా బ్యాటరీస్‌పై మాట్లాడలేదేం?
రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్‌ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో కలుషితం జరుగుతోందని ఫిర్యాదు వస్తే చంద్రబాబు, యనమల ఎందుకు స్పందించలేదని మంత్రి అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కూడా దీన్ని ధృవీకరించిందన్నారు. మీ పార్టీకి చెందిన వారి పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడి ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదా? అని నిలదీశారు. 

హంసలా ఆరు నెలలున్నా చాలు 
రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా చంద్రబాబుకు నిద్ర పట్టదని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌కు యావత్‌ తెలుగు ప్రజలంతా నివాళులర్పిస్తూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చంద్రబాబు సహించలేక పోతున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కాకిలా కలకాలం ఉండేకన్నా హంసలా ఆరు నెలలు బతికినా చాలన్నారు.

మరిన్ని వార్తలు