కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్‌

30 Sep, 2022 15:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణ మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్నాథ్‌. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌పై కోపం ఉంటే ఆయన్నే హరీష్‌రావు విమర్శించువచ్చు కదా అని చురకలు అంటించారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, హరీష్‌రావును చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైఎస్‌ఆర్‌సీపీకీ లేదని స్పష్టం చేశారు. మమ్మల్ని తిడితే మీకు మార్కులు పడతాయా? అని ప్రశ్నించారు. ‘ఏపీ భవన్‌లో హరీష్‌రావు అధికారిని కాలితో తన్నిన ఘటన జనం మర్చిపోలేదు, హరీష్‌ రావు.. సీఎం కేసీఆర్‌ మనిషా లేక రామోజీరావు మనిషా తేల్చుకోవాలి. తెలంగాణను చూసి మేం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మమ్మల్ని విమర్శిస్తే కేసీఆర్‌ను తిడతామని హరీష్‌రావు అనుకుంటున్నారేమో. కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్‌. 

మహా వృక్షంగా వైఎస్‌ఆర్‌ నాటిన మొక్క..
రేపటి నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు మంత్రి అమర్నాథ్‌. జనవరి నుంచి ఇన్ఫోసిస్‌ పూర్తిస్థాయి సేవలు అమలులోకి వస్తాయన్నారు. దీని ద్వారా తొలి దశలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బీచ్‌ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2006లో వైఎస్‌ఆర్‌ వేసిన ఐటీ మొక్క నేడు మహా వృక్షంగా మారిందని గుర్తు చేశారు. దలపల్లా భూములపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్‌ సరికాదు: సజ్జల

మరిన్ని వార్తలు