చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు: జోగి రమేష్‌

22 May, 2022 15:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్ సదస్సుకు వెళ్తే టీడీపీ నేతలు ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లటం తప్పా?. పట్టాభి, యనమలలాంటి వ్యక్తులు కడుపు ఉబ్బరంతో అల్కాడిపోతున్నారు. గతంలో చంద్రబాబు తన వెంట దోపిడీ దొంగలను తీసుకుని వెళ్లాడు. దోచుకున్న సొమ్మును దాచుకోవటానికి 38 సార్లు తీసుకెళ్లాడు.

సీఎం వైఎస్‌ జగన్ మొదటిసారి కుటుంబ సభ్యులతో వెళ్తే ఓర్చుకోలేక పోతున్నారు. ఏం జరిగిందని చిలవలు వలువలుగా కథనాలు రాస్తున్నారు?. వీరందరి పాపం పండింది. యనమల రామకృష్ణుడి వయసెంత? మాట్లాడే మాటలు ఏంటి?. చంద్రబాబుకు మతిమరుపు రోగం, యనమలకు కడుపు ఉబ్బరం రోగం, పట్టాభికి కడుపు మంట రోగం గతంలో చంద్రబాబు దావోస్ వెళ్లి బుల్లెట్ రైలు పక్కన నిలపడి ఫొటోలు తీసుకున్నారు. మేము దావోస్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. ఇది చూసి తట్టుకోలేక అనవసరంగా ఊగిపోతున్నారు.

మీరు ఎంత ఊగిపోయినా సీఎం వైఎస్‌ జగన్ వెంటే జనం ఉన్నారని గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు చేసిన వంచన, దుర్మార్గాలు ఊరికే పోవు. అన్ని వర్గాలనూ వేధించిన పాపం వలనే 23 సీట్లకు పరిమితం అయ్యాడు. మా ‌పార్టీకి చెందిన వ్యక్తి కేసులో ఇరుక్కుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోమని సీఎం జగన్‌ చెప్పారు. సీఎం జగన్ దావోస్ వెళ్లింది రాష్ట్ర అభివృద్ధి కోసమే. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మంచి జరుగుతుందని మేం భావిస్తున్నాం. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ఆయనను జనం నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ 23 సీట్లు కూడా రావు. సీఎం జగన్ అన్ని వర్గాలకూ దేవుడిలా మారారు. మా ఎమ్మెల్సీపై ఆరోపణలు వస్తే వెంటనే అతనిపై కేసు పెట్టమని సీఎం చెప్పారు. చట్టం అందరికీ సమానమే’’ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు