రాష్ట్రానికి మంత్రి అయినా మీ ఇంట్లో బిడ్డనే: కాకాణి

15 May, 2022 12:49 IST|Sakshi
మంత్రి కాకాణిని బహిరంగ సభలో సన్మానిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు   

ఎన్ని జన్మలెత్తినా సర్వేపల్లి ప్రజల రుణం తీర్చుకోలేను 

నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా 

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

సాక్షి, నెల్లూరు(పొదలకూరు): రాష్ట్ర మంత్రిగా ఎన్ని బాధ్యతలు ఉన్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని మంత్రి కాకాణి వెల్లడించారు. ఎన్ని జన్మలెత్తినా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని, నా రాజకీయ గురువు తన తండ్రి కాకాణి రమణారెడ్డి అయితే, రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం సర్వేపల్లి ప్రజలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులో శనివారం మంత్రికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ పౌర సన్మానం చేశారు.  స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి సభాస్థలి పంచాయతీ బస్టాండ్‌ వరకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కాకాణి మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహమే అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేని చేసిన సర్వేపల్లి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. రాష్ట్రానికి మంత్రి అయినా మీ ఇంట్లో బిడ్డనేనని, ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పొదలకూరు మండల కార్యకర్తలు తనకు సన్మానం చేయడమంటే ఇంట్లో బిడ్డను సత్కరించినట్టుగా తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. వీలైతే తానే ప్రతి ఒక్కరిని సన్మానిస్తానన్నారు.

సభకు హాజరైన జనం
  
రైతు సంక్షేమానికి కృషి  
సీఎం అండదండలతో తనకు కేటాయించిన శాఖలకు వన్నె తేవడంతో పాటు రైతుల సంక్షేమానికి పాటు పడతానన్నారు. రైతులకు వచ్చే నెలలో 3 వేల ట్రాక్టర్లు, హార్వెస్టింగ్‌ యంత్రాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులు సబ్సిడీతో అందజేస్తామన్నారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు నిర్మించేందుకు రూ.1,079 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా చేస్తానని, మరో ఆరు నెలల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల స్వరూపం మారుస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.28 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామాల్లో రూ.300 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లను పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అభిమానులు గజమాలలు, శాలువలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్‌ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సోమా అరుణ, సొసైటీ చైర్మన్‌ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, ఏఎంసీ చైర్మన్‌ పెదమల్లు రత్నమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, రావుల దశరథరామయ్యగౌడ్, నువ్వుల మంజుల, సర్పంచ్‌ చిట్టెమ్మ, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు