టీడీపీతో కలిసి ఎస్ఈసీ శవ రాజకీయాలు చేస్తున్నారు..

2 Feb, 2021 20:29 IST|Sakshi

సాక్షి, కాకినాడ: టీడీపీతో కలిసి శవ రాజకీయాలు చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. చంద్రబాబుపై గురు భక్తిని చాటుకుంటున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గొల్లలగుంట ఘటనలో విచారణ జరగకుండానే ఎస్‌ఈసీ ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఈసీ, ట్రైనీ నాయకుడు లోకేశ్‌ బాబు గొల్లలగుంటలో ఒకేసారి వాలిపోవడంతో వీరి మధ్య చీకటి ఒప్పందం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొల్లలగుంట వ్యక్తి మృతి చాలా బాధాకరమని, దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. 

టీడీపీ హయాంలో ఎన్నికలు నిర్వహించలేని ఎస్‌ఈసీ..విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏకగ్రీవాల సాంప్రదాయం 1992లో గుజరాత్‌లో మోదీ ప్రవేశపెట్టారని, దేశంలో అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2600 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయని గుర్తు చేశారు. ఏకగ్రీవాలు రాజ్యాంగ స్పూర్తి అని పేర్కొన్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబం హత్యారాజకీయాలకు పాల్పడుతూ.. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. టీడీపీ మేనిఫెస్టోపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకున్నారని కన్నబాబు ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు