‘రేషన్‌ షాపుల మూసివేత పచ్చి అబద్ధం.. ఒక్క కార్డూ తొలగించలేదు​‍’

25 Jul, 2022 13:58 IST|Sakshi

తాడేపల్లి: కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్‌ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడ్డ జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలు అందరికి ఇస్తామని, ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపులను మూసేస్తామని వస్తున్న వాదనలు పచ్చి అబద‍్ధమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించలేదన్నారు. కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. 

కోటీ 50 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం: మంత్రి బొత్స
రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు మంత్రి. 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందన్నారు. తాము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామని తెలిపారు. ‘ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుంచి పునరాలోచన చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమే. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించాం. కేంద్రం ఇచ్చే  కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వనరుల సమీకరణపై సీఎం జగన్‌ సమీక్ష

మరిన్ని వార్తలు