ఈ ఏడాది 15 లక్షల మంది పేదలకు ఇళ్లు: కొడాలి నాని

1 Jul, 2021 20:40 IST|Sakshi

లబ్ధిదారుల నుంచి అపూర్వ స్పందన

మంత్రి కొడాలి నాని

సాక్షి, గుడివాడ: రాష్ట్రంలో ఈ ఏడాది 15 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించాలనే సంకల్పంతో నేటి నుంచి ఈ నెల 4 వరకు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించామని పౌర సరాఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. లబ్ధిదారుల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. వైఎస్సార్‌ బీమా పేదలకు ఒక వరమని.. వైఎస్సార్‌ బీమాలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించి తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

రాష్టంలో అభివృద్ధి, సంక్షేమం శరవేగంగా జరుగుతుంటే చంద్రబాబు నిరసన దీక్ష చేస్తున్నారని.. చంద్రబాబును పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కొడాలి ఎద్దేవా చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉన్నారన్నారు. ఈనెల 5 నుంచి కృష్ణా జిల్లాలో సాగునీరు విడుదల చేస్తామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు.

ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సామినేని శంకుస్థాపన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్‌పేట, కొనకంచి, లింగగూడెం, ముచ్చింతల, వత్సవాయి, చిన్న మోదుగపల్లి గ్రామాల్లో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శంకుస్థాపన చేశారు.  మోపిదేవి మండలం కొత్తపాలెం, చల్లపల్లి, ఘటంసాల మండలాల్లో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే రమేష్‌బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహారావు శంకుస్థాపనలు చేశారు. 

అన్ని వసతులతో జగనన్న కాలనీలు: ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌ జైన్‌
వణుకూరులో 610 మంది లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన చేశామని  ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌ జైన్ అన్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్లు ఇస్తున్నారని.. రెండున్నర ఏళ్లలో 28 లక్షల మందికి ఇళ్లు కట్టిచ్చి ఇస్తామన్నారు. ‘‘50 వేల కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. 1705 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. డ్రైనేజీ, నీరు, కరెంట్, రోడ్లు అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని’’ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌ జైన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు