ఏపీ ఆదర్శంగా కేరళలోనూ ఇంటి వద్దకే రేషన్‌

30 Oct, 2021 05:24 IST|Sakshi
కేరళ మంత్రిని సత్కరిస్తున్న మంత్రి కొడాలి నాని

ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడి

అధ్యయనం చేసేందుకే వచ్చాం 

ఈ విధానం దేశానికే ఆదర్శం 

సాక్షి, అమరావతి: ఏపీలోని రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌æ కొనియాడారు. 85 శాతం మందికి ఇంటింటికీ బియ్యం పంపిణీ ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. కేరళలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన ఆయన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులతో కలిసి.. వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీని స్వయంగా పరిశీలించారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఏపీలో ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు 
అనంతరం కేరళ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నేరుగా పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ను అత్యంత పారదర్శకంగా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఆంధ్రా నుంచి కేరళకు బియ్యం రవాణా చేసే విషయంపై చర్చించినట్టు తెలిపారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్, రేషన్‌ పంపిణీ వ్యవస్థల వంటి విప్లవాత్మక కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం గర్వకారణమన్నారు. సుమారు 65 లక్షల మందికి ఫించన్లు ఇచ్చే కార్యక్రమం ఐదారు గంటల్లోనే పూర్తి చేసే సామర్థ్యం ఏపీలో ఉందన్నారు. కార్యక్రమంలో కేరళ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సాజిత్‌ బాబు, ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, డైరెక్టర్‌ ఢిల్లీరావు, పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్‌ ఎండీ వీరపాండ్యన్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు