ఓటుతో చంద్రబాబును తరిమికొట్టండి:‍ కొడాలి నాని

4 Mar, 2021 21:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అద్భుత పరిపాలన చూసి, పోటీ చేసినా ఓటమి తప్పదని టీడీపీ, బీజేపీ అభ్యర్దులు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌ సైడేనన్నారు. విజయవాడ నగర మేయర్ పీఠంపై వైఎస్సార్సీపీ జండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చేరాయని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగా, నెహ్రూ పిల్లలను ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకు విజయవాడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఆరోగ్యం, విద్య, నివాసం కల్పించాలని ఆలోచన చేస్తున్నారని, ఇందులో భాగంగా అనేక పథకాలు ఇదివరకే ప్రజలకు చేరువయ్యాయన్నారు. సీఎం జగన్‌ విద్య విషయంలో తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తారని, ఈ విషయంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని ప్రశంసించారు. పేదల ఆరోగ్యం విషయంలోనూ తండ్రి బాటలో సీఎం జగన్‌ నడుస్తున్నారన్నారు. 30 వేల కోట్ల భూముల కొని 30 లక్షల మంది పేదలకు పంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 3 సెంట్ల భూమి ఇస్తానని 14 ఏళ్లు కాలయాపన చేసిన దుర్మాగుడు చంద్రబాబన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన మొనగాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డే అన్నారు. అన్ని డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్దులను గెలిపించుకొని, నగర అభివృద్ధికి అధిక నిధులు తెచ్చుకుందామన్నారు. 

రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు..
ఆర్థికంగా చితికి పోయిన రాష్టంలో కులమతాలకతీతంగా సంక్షేమ పధకాలను గడపగడపకు అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పధకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ రాష్ట్ర ప్రజల పాలిట ఆరాధ్యుడయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో 36 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. అమ్మాఇది నీ ఇల్లు.. కొబ్బరి కాయ కొట్టి లోనికి వెళ్ళు అని మహిళాలోకానికి ధైర్యం నింపారన్నారు. ప్లకార్డులు పట్టుకునే కమ్యూనిస్టు కూడా ఇళ్ల గురించి చర్చించేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 
 

మరిన్ని వార్తలు