రైతుల ఆత్మహత్యలు బాధాకరం

3 Sep, 2020 18:57 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించిందని.. దాని ఫలితమే 2019లో 313 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడారన్నారు. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.7లక్షల ఆర్థిక సాయం ప్రకటించామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ వెళ్లి ఆర్థికసాయం అందజేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. (చదవండి: రైతులపై ఒక్క పైసా భారం పడదు: సీఎం జగన్‌)

‘‘రైతు భరోసా పథకంతో రైతులకు భరోసా కల్పించాం. ఇప్పటివరకు రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా చేస్తున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో అరటి నుంచి జామ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసింది. రైతుల ఉత్పత్తుల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని’’ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబుకు బాలినేని సవాల్‌!)

చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించామన్నారు. ఇప్పటివరకు 2020లో 157 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. త్రిసభ్య కమిటీ నిర్ధారించింది 33 కేసులని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో విత్తనాలు అందించి, అసలు క్యూ లైన్లు లేకుండా చూశామని, క్యూ లైన్‌లో నిలబడి గుండెపోటుతో చనిపోతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించడం దారుణమని కన్నబాబు దుయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు