ఆ నిర్ణయం చారిత్రాత్మకం: మంత్రి కన్నబాబు

15 Jul, 2021 12:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుందన్నారు. ఉద్యోగ నియామకాల్లో కేంద్ర నిబంధనలను మార్పులు చేశారన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు. గత ప్రభుత్వ తీర్మానాలపై కేంద్రం లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

కాపులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఉదాహరణ అన్నారు. ‘‘బీసీ ఎఫ్‌ కేటగిరీ అని, మళ్లీ ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం పేరుతో రెండు తీర్మానాలు చేశారు. చంద్రబాబు గతంలో కాపులను మోసం చేసేలా తీర్మానం చేశారు. చంద్రబాబు దృష్టిలో కాపులు బీసీలా? ఓసీలా అర్ధం కాని పరిస్థితి. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలతో కాపులు నష్టపోయారని.. కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా బాబు వ్యవహరించారని కన్నబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన జీవోతో కాపులతోపాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలుచేస్తామన్నారు. అన్ని వర్గాలను ఆదుకోవాలనేదే సీఎం జగన్ సంకల్పమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు