అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు మభ్యపెడుతున్నారు: కన్నబాబు

8 Aug, 2021 17:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఐదేళ్లూ అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఉద్యమం పేరుతో మభ్యపెట్టాలనే ప్రయత్నిస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు.. అభివృద్ధి వికేంద్రీకరణను తన స్వార్థం కోసం వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ భావించారని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు స్వార్థంతోనే వ్యతిరేకిస్తున్నారని, ఆయన చేసిన తప్పిదాల వల్లే దారుణంగా ఓటమి చెందారని మంత్రి ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారని, అయినా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని మండిపడ్డారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలు సంయమనం పాటించారని, రాజధాని ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీకి ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో పెట్టిన తమ పెట్టుబడులకు తగిన రాబడులు రావనే కారణంతోనే బాబు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా కన్నబాబు తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని కన్నబాబు గుర్తుచేశారు.. హైదరాబాద్‌లోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతమైందన్నారు.

విశాఖ పరిపాలన రాజధానికి అచ్చెన్నాయుడి మద్దతు ఉందా? లేదా? సూటిగా కన్నబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అమరావతికి అధ్యక్షుడా? లేదా ఏపీ టీడీపీకి అధ్యక్షుడా? అని నిలదీశారు. తాము స్పష్టంగా చెబుతున్నాంమని, అమరావతి అభివృద్ధి కూడా తమ బాధ్యతేనని కన్నబాబు తెలిపారు. మోసం గురించి యనమలే చెప్పాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడుస్తుంటే ఆయన వెంటే ఉన్నాడని, వారు దివాలాకోరుతనం గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటారని అన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తే యనమలకు వచ్చే ఇబ్బందేంటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఎవరు నియంతలా వ్యవహరించారో యనమల ఆలోచించుకోవాలని మండిపడ్డారు.

కచ్చితంగా 3 రాజధానులు ఉంటాయనని మంత్రి కన్నబాబు తెలిపారు. 600 రోజుల పండగ అంటూ అక్కడి ప్రజలను మోసం చేయొద్దని, మీరు చేస్తే ఉద్యమాలు.. దళితులు చేస్తే అల్లరి మూకలా? అని విరుచుకపడ్డారు. చంద్రబాబు బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పోరాటం రియల్‌ఎస్టేట్ కోసమైతే.. అన్నిప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. మట్టి, నీరు తెచ్చి పండగ చేసే ప్రభుత్వం మాది కాదని, సీఎం జగన్ ప్రభుత్వం అన్నిప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు.

స్వార్ధ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని మంత్రి కన్నబాబు అన్నారు. వికేంద్రకరణ కోసం సీఎం జగన్ 3 రాజధానులకు సంకల్పించారని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా రెఫరెండం అనే చంద్రబాబు.. అమరావతి ప్రాంతంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూశారని అన్నారు. ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారో చంద్రబాబుకు ఇంకా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు. గుంటూరు, విజయవాడల్లో మొత్తం వైఎస్సార్‌సీపీ గెలిచిందని తెలిపారు. మరి దాన్ని ఎందుకు రెఫరెండంగా చంద్రబాబు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారని, అమరావతిలో పెట్టిన తమ పెట్టుబడులకు రాబడులు రావని బాబుకు ఆవేదన ఉందన్నారు. 

మరిన్ని వార్తలు