వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి

18 Aug, 2020 20:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి జరగనుందని, ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెడతామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధపెట్టామన్నారు. చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల కోసం 7 హార్బర్‌లను అధునాతనంగా నిర్మించనున్నామని వెల్లడించారు. మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘45 వేల ఎకరాలలో శ్రీసిటీ తరహా సకల సదుపాయాలుండే ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లను నిర్మిస్తాం. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలోని అనువణువు శోధించి పరిశ్రమల ఏర్పాటులో వేగం కోసం రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజించనున్నాం. ( ఐఎస్‌బీ ఒప్పందం చారిత్రాత్మకం : మేకపాటి)

ఏ పరిశ్రమ వచ్చినా ఎక్కడ ఏర్పాటు చేయాలో రూట్ మ్యాప్ కోసం క్లస్టర్లుగా విభజన జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులతో ముందుకెళుతున్నాం. అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్న విశాఖ ఎయిర్ పోర్టును డిసెంబర్లో నిర్మాణ పనులు చేపడతాం. రోడ్లుంటే ఎయిర్ పోర్టులు లేకపోవడం, ఎయిర్ పోర్టులుంటే పోర్టులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు లేకుండా సమగ్రంగా అన్ని రవాణా సదుపాయాలపై శ్రద్ధ వహించాం. తిరుపతి ఎయిర్ పోర్ట్‌ను ఇంటర్నేషనల్ కార్గో హబ్‌గా, కర్నూలు ఎయిర్ పోర్ట్ త్వరలోనే ఆన్‌లైన్‌లోకి వస్తుంది. కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురానున్నాం.

విజయవాడ విమానాశ్రామాన్ని విస్తరించనున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. రానున్న 2-3 సంవత్సరాలలో 5 విమానాశ్రాయాలు పూర్తి సదుపాయాలతో అందుబాటులోకి వస్తాయి. ఒక్కో పోర్టుకు రూ.10వేల కోట్లలాగా...3 మేజర్ పోర్టులు, దాదాపు 2వేల కోట్లు వెచ్చించి 7 ఫిషింగ్ హార్బర్లు, 3 రాజధానులు, కారిడార్లు సిద్ధమవుతాయి. 175 నియోజకవర్గాల్లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య లేకుండా రూ.30-40 వేల కోట్లు ఖర్చు చేసి వాటర్ గ్రిడ్ ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుంది’’ అని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు