ఆ దాడులు కుట్రలో భాగమే: సుచరిత

25 Sep, 2020 09:58 IST|Sakshi

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, అనంతపురం: మహిళల భద్రతకు పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ‘ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’ ద్వారా ప్రజల చెంతకే పోలీసు సేవలు తీసుకువచ్చామని తెలిపారు. ‘దిశ’ యాప్‌ను 11 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ ఈ-ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. (చదవండి: ఇక నుంచి పోలీస్‌ సేవలు సులభతరం..)

పోలీసు శాఖలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీసు కార్యదర్శులు నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు 37 జాతీయ పురస్కారాలు దక్కాయని తెలిపారు. అత్యంత పకడ్బందీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలు, హోంగార్డులకు రూ.30 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

ఏపీలో ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సుచరిత మండిపడ్డారు. దళితులపై దాడులు తగ్గాయని.. ఆలయాలపై దాడులు కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వానికి మంచి పేరు రావటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలనూ ఉపేక్షించొద్దని సీఎం జగన్ ఆదేశించారని సుచరిత పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా