AP: రాష్ట్రంలో సామాజిక విప్లవం

25 May, 2022 11:13 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వల్లే  ఇది సాకారం

బడుగు, బలహీన వర్గాలను హీనంగా చూసిన గత ప్రభుత్వాలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో    అన్నింటా సముచిత స్థానం

సామాజిక విప్లవాన్ని ప్రజలకు వివరించేందుకే బస్సు యాత్ర

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున

సమష్టిగా సాగి జయప్రదం చేద్దాం:మంత్రి ఉషశ్రీచరణ్‌ పిలుపు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన సామాజిక విప్లవంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా పదవులను కట్టబెట్టి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.

గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సామాజిక న్యాయాన్ని తెలియజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. యాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఉషశ్రీచరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు,ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులను హరించి అణగారిన వర్గాలుగా చూసిన చరిత్ర గత పాలకులదైతే, అన్నింటా పెద్దపీట వేసి వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు దోహదపడిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. విద్యతోనే అభ్యున్నతి సాధ్యమని నమ్మి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించి సమాజంలో ఉన్నతంగా జీవించేలా ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. సీఎం జగన్‌ తీసుకొచ్చిన సామాజిక విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.  మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,    మైనార్టీలకు స్థానం కల్పించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగే సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

బడుగు, బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి నాగార్జున విమర్శించారు. బీసీలను అన్నింటా వంచించిన చంద్రబాబును కొన్ని మీడియా సంస్థలు, పెయిడ్‌ ఆర్టిస్టులు అట్టిపెట్టుకుని అభూతకల్పనలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న సమయంలో  టీడీపీ నేతలు ఎన్ని అరాచకాలు చేపట్టినా కళ్లులేని కబోధిలాగా ఉన్న చంద్రబాబు.. నేడు చిన్న ఘటనను కూడా పెద్దదిగా చూపించాలనుకోవడం ఆయన రెండునాల్కల ధోరణికి నిదర్శనమన్నారు.

ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని హేళన చేసిన విషయాన్ని ఇంకా ఎవరూ మరువలేదన్నారు. కరోనా విజృంభించిన సమయంలో హైదరాబాద్‌ పారిపోయిన ఆయనను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఓ ఎస్సీ అమ్మాయి మృతదేహాన్ని    ఇంటికి తీసుకెళ్తుంటే లోకేష్‌ వస్తున్నాడంటూ ఆపి శవాల మీద పేలాలు ఏరుకున్నారని, వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ భేరి యాత్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముస్లింల దోస్త్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అభివర్ణించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని, అయితే ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పప్పు నాయుడు, తుప్పునాయుడుల పార్టీకి 2024లో పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్‌ కల్పించి సమాజంలో గుర్తింపునిచ్చిందని తెలిపారు. 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విప్లవాత్మకమని పేర్కొన్నారు. 

రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు ఖాదర్‌బాషా మాట్లాడుతూ మైనార్టీలకు మేయర్లుగా, చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ మొహమ్మద్‌ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహమ్మద్, రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ హరిత, పార్టీ నాయకులు కాగజ్‌ఘర్‌    రిజ్వాన్, రమేష్‌గౌడ్, కృష్ణవేణి, రాధాయాదవ్, కుళ్లాయిస్వామి, శ్రీనివాసులు, అనిల్‌కుమార్‌ గౌడ్, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బీసీలంటే బెస్ట్‌ క్లాస్‌ అని నిరూపించారు.. 
బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ ది సొసైటీ, బెస్ట్‌ క్లాస్‌ ఆఫ్‌ ది సొసైటీ అని సీఎం వైఎస్‌ జగన్‌ నిరూపించారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ తెలిపారు.     ఎంతో ఉన్నత లక్ష్యంతో బడుగు, బలహీన వర్గాల వారికి పదవులను కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. గత ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా పల్లె రఘునాథ రెడ్డిని నియమించారని, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రి పదవి కేటాయించలేదని దుయ్యబట్టారు. సమష్టిగా సాగి సామాజిక న్యాయ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు