రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ

1 Dec, 2023 15:54 IST|Sakshi

సాక్షి,తాడేపల్లి : అబద్ధాల రామోజీకి చంద్రబాబంటే ఎంతో స్వీటని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పత్రికలో మళ్ళీ విషం కక్కి మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దానికి సమాధానం చెప్పాలని రాశారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలోనే సీఎం జగన్ సామాజిక విప్లవానికి తెరతీశారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సీఎం జగన్ పని చేస్తుంటే రామోజీకి కనపడటం లేదని విమర్శించారు. 

‘నాడు నేడు కింద సీఎం జగన్‌ స్కూల్లను బాగు చేయించారు. చంద్రబాబు హయాంలో రెండు వేల స్కూళ్లను మూసివేసి పేదపిల్లల జీవితాలను నాశనం చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా జగన్ ప్రభుత్వ స్కూళ్లని అభివృద్ధి చేశారు. చంద్రబాబు హయాంలో విదేశీ విద్య పేరుతో అక్రమాలకు పాల్లడ్డారు. దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జగన్ చేసిన మంచిపనులు రామోజీరావుకి కనపడటం లేదు. ఆయన రాతలను జనం నమ్మే పరిస్థితి లేదుజ జగన్ వచ్చాకే దళితుల స్థితిగతులు మారాయి’ అని మేరుగ తెలిపారు. 

‘జగన్‌ వచ్చాక పేద బతుకుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఎస్సీలను బాగు చేయడానికి కార్పొరేషన్లు పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నాం. ప్రతి పైసా దళితులకు అందేలా చర్యలు చేపట్టాం. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు ఏనాడైనా కనిపించారా? రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చంద్రబాబు కోర్టుకు వెళ్తే రామోజీరావు ఎందుకు రాయలేదు? ఇంగ్లీష్‌ మీడియం పేదలకు అవసరం లేదని కోర్టుకు వెళ్తే మీ పత్రికలో ఎందుకు రాయలేదు? రాజధానిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా చంద్రబాబు కుట్ర పన్నితే ఎందుకు రాయలేదు’ అని మేరుగ ప్రశ్నించారు.

‘అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్ కట్టిస్తుంటే రామోజీరావుకి కనిపించడం లేదా? చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడులు జరిగితే నీ పత్రికలో ఎందుకు రాయలేదు రామోజీ? దళితులపై దాడిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని చంద్రబాబు హయాంలో తేలితే ఎందుకు రాయలేదు? గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్‌ను జగన్ ఏర్పాటు చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి భరోసా కల్పిస్తే ఎందుకు రాయలేదు? గిరిజన యూనివర్సిటీ మేము నిర్మిస్తుంటే ఎందుకు రాయలేదు? దీనిపై చర్చకు మేము సిద్దమే, టీడీపీ నేతలు, రామోజీరావు చర్చకు వస్తారా? అని మంత్రి సవాల్‌ విసిరారు. 

ఇదీచదవండి...ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

మరిన్ని వార్తలు