సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం: మంత్రి పెద్దిరెడ్డి

16 Sep, 2020 12:27 IST|Sakshi

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పథకాలన్ని నేరుగా ప్రజలకి అందేలా సచివాలయ వ్యవస్థ తెచ్చారు అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామ చం‍ద్రారెడ్డి,జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలలో, మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి  సర్వం సిద్ధం చేశాం. కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్‌ రూములను సిద్ధం చేశాం. పీపీఈ కిట్‌లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్ చేస్తారు’ అని చెప్పారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్‌ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

వీడియో కాన్ఫెరెన్స్‌ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ‘సచివాలయ వ్యవస్థ వల్ల దేశంలో మన రాష్ట్రానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ఒక్కో సచివాలయంలో 12 నుంచి 14 మంది వరకూ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. గత ఏడాది 1.10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. 14062 గ్రామ సచివాలయాల్లో, 2166 వార్డు సచివాలయాల్లో ఖాళీలు  ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 10 లక్షల మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలు పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్‌తో నిర్వహిస్తాం. పాజిటివ్ వచ్చిన వారికి పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేశాం. అభ్యర్థుల కోసం ఆర్టీసీతో కూడా మట్లాడాం. వారి సహకారం తీసుకుంటాం. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొంతమంది హాల్ టికెట్స్ రాలేదని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. నిర్దేశించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయి’ అని ఆయన తెలిపారు.

చదవండి: వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు

మరిన్ని వార్తలు