ఏపీ: స్వయం ఉపాధిలో ‘చేయూత’ మహిళలు

13 Aug, 2021 10:10 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి

78వేల రిటైల్‌ షాపుల ఏర్పాటు

1.19 లక్షల పశువులు, 70,955 గొర్రెలు, మేకలను కొన్న లబ్ధిదారులు

పథకం అమలులో అధికారుల కృషికి ప్రశంసలు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందాలి

పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ చేయూత పథకం తొలి విడతలో 78 వేల రిటైల్‌ షాపులను మహిళలు ఏర్పాటుచేశారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తొలి విడత చేయూత లబ్ధిదారులు 1,19,000 పశువులను, 70,955 గొర్రెలు, మేకలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌ 12న వైఎస్సార్‌ చేయూత మొదటి విడత కార్యక్రమాన్ని అమలు చేశామని, దీనిలో మొత్తం 24,00,111 మంది లబ్ధిదారులకు రూ.4,500.20 కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు. రెండో ఏడాది 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.4,400 కోట్ల అర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు.

మంచి ఆశయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకాన్ని అమలుచేయడం, పర్యవేక్షించడంలో అధికారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రశంసించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్‌ అంశాలను అధ్యయనం చేయాలని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లపై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్‌ ఖేధీ వంటి ప్రముఖ సంస్థలు మహిళల వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మార్కెటింగ్‌లో శిక్షణకు ముందుకు వచ్చాయన్నారు. 

వీధి దీపాల నిర్వహణలో ఏజెన్సీ విఫలం
గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీ పనితీరుపట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వీధిదీపాలకు చెల్లిస్తున్న విద్యుత్‌ బిల్లును తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేశామని.. అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ విఫలమయ్యిందన్నారు. పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతుండడంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. వీటి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇక పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని  అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈఓ ఎన్‌ఎండీ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు