ఓటు నమోదు చేసుకోవడం రాని వ్యక్తి ఎస్‌ఈసీగా ఉన్నారు..

5 Feb, 2021 19:47 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఓటు నమోదు చేసుకోవడం చేత కాని వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ఉండటం తమ దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన పరిధిలోని అధికారాలపై లెక్చర్లు దంచికొట్టే నిమ్మగడ్డకు ఓటు ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఎస్‌ఈసీని నిలదీశారు. చంద్రబాబుకు మేలు చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో చేస్తారని నిమ్మగడ్డ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీ చర్యలు ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు.
 
తొలిదశలో పంచాయతీ ఎన్నికల్లో 500లకుపైగా సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవమైన అభ్యర్థులు డిక్లరేషన్‌ పత్రాలు తీసుకున్నాక రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవాలు జరగకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని ఎస్‌ఈసీని నిలదీశారు. రిటర్నింగ్‌ అధికారి అధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎస్‌ఈసీకి లేదన్నారు. నిమ్మగడ్డ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయన మాటాలు విని అధికారులెవరు కూడా  అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలా కాదని ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై భవిష్యత్తులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు